రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 27 శాతం ఉన్న కాపులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నంత కాలం వారికి శాసించే శక్తి ఉండదని, యాచించే పరిస్థితే ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. కాపులు శాసించే స్థితికి ఎదగాలని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి, చంద్రబాబు సహా ఏ రాజకీయ నాయకుడైనా సరే కాపుల డిమాండ్ల పరిష్కారం కోసం ఆ ఉద్యమ నేతల వద్దకు రావాలన్నారు. అంతేతప్ప నేతలే రాజకీయ నాయకుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని సూచించారు. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు శుక్రవారం జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసి సమస్యలను వివరించారు. జనసేనపై కుల ముద్ర వేస్తారనే భయంతోనే ఇప్పటివరకు పవన్‌ను కలవలేదని జోగయ్య ఈ సందర్భంగా అన్నారు. భేటీ అనంతరం పవన్ విలేకర్లతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల్లో కాపుల నుంచి ఒక్కరు కూడా లేరన్నారు. కాపులు బలోపేతం కావటమంటే బీసీల్ని బలహీనపరచటం కాదని అభిప్రాయపడ్డారు. అలజడులకు లోనుకాకుండా క్రమపద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి వారు రాజకీయ సాధికారత సాధించగలిగితే.. వెనుకబడిన యాదవ, గౌడ తదితర కులాలకు కూడా దారి చూపించిన వారవుతారన్నారు. ‘1935లో కాపుల్ని బీసీలుగా ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి వారిని బీసీల జాబితా నుంచి తొలగించారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న కాపుల్ని బ్రిటిష్ కాలం నుంచే తూర్పు కాపు, మున్నూరు కాపులుగా విడగొట్టేశారు. కాపులు రాజకీయ సాధికారత సాధించగలిగితేనే శాసించే స్థాయికి వస్తారని రామమనోహర్ లోహియా కూడా ‘భారతదేశంలో కులాలు’ పుస్తకంలో పేర్కొన్నారు’ అని పవన్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, దళిత నేత దామోదరం సంజీవయ్యను కాపులు గుండెల్లో పెట్టుకోవాలన్నారు.
నేను చెప్పేది…కాపులు గుండెల్లో పెట్టుకోవాలి
Related tags :