Food

షుగర్ వ్యాధి ఉంటే అన్నం తినకూడదా?

షుగర్ వ్యాధి ఉంటే అన్నం తినకూడదా?

చాలాకాలం నుంచి నేను అన్నం తినడం మానేశా. అన్నం బదులు రెండు రొట్టెలు తింటున్నా. బరువు తగ్గాను కానీ, షుగర్‌ నియంత్రణలో తేడా మాత్రం కనిపించలేదు. మధుమేహం (డయాబెటిస్‌) ఉన్నవారు అసలు అన్నం తినవచ్చా, లేదా? కొంతమంది మామూలు అన్నం వద్దు… బ్రౌన్‌ రైస్‌ తినవచ్చు అంటున్నారు. ఏది మంచిది? రైస్‌ తినడం వల్ల అసలు నష్టాలు ఏంటి?
**మీ మొదటి ప్రశ్న
మీరు రైస్‌ బదులుగా రెండు రొట్టెలు తినడం వల్ల బరువు తగ్గడానికి కారణం ఆహారం మితం అవ్వడమే! అంతే మితంగా రైస్‌ తీసుకున్నా, బరువు తగ్గుతారు. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏమిటంటే షుగర్‌ కంట్రోల్‌లో లేనప్పుడు కూడా కొంత వెయిట్‌ లాస్‌ వస్తుంది.మీరు బరువు తగ్గినా, షుగర్‌ తగ్గకపోవడానికి కారణం ఆహారం ఒకటికాగా… తీసుకుంటున్న మందులు రెండోది. రోజువారీ ఒత్తిడి, ఇతర అనారోగ్యాలు మూడోది. ఈ మూడే ప్రధాన కారణాలు. వీటి బారి నుంచి బయటపడాలంటే, వీటి మధ్య సమతుల్యత పాటించాలి. మీరు తీసుకునే ఆహారం, ముఖ్యంగా మీకు ఇష్టమైనదై ఉండాలి. అందులో పీచు పదార్థం సమృద్ధిగా ఉండాలి. అంటే ప్రతిసారీ ఆహారం తీసుకుంటున్నప్పుడు కాయగూరలు, తొక్క తియ్యని గింజలు ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడు మీకు షుగర్‌ కంట్రోల్‌లోకి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.
**మీ రెండో ప్రశ్న
డయాబెటిస్‌ ఉన్నవారు నిరభ్యంతరంగా రైస్‌ తినవచ్చు. మనం భోజనం చేసేటప్పుడు కేవలం అన్నం మాత్రమే తినం. దానితో పాటు పప్పు, కూర, పెరుగు, పచ్చడి, రసం మొదలైనవి తింటాం. ఇన్ని రకాలు తినడానికి ఎక్కువ అన్నం అవసరం. దాంతో, ఎక్కువ భోజనం చేస్తారు. అందువల్ల షుగర్‌ పెరుగుతుంది. భోజనంలో నియంత్రణ పాటిస్తే, అన్ని రకాలూ తినవచ్చు. తిన్నా కూడా, షుగర్‌ను అదుపు చేయవచ్చు. ఏతావతా, మీరు మీ ఆరోగ్యానికి తగినంతే, మితంగా తినాలి.
**మీ మూడో ప్రశ్న
బ్రౌన్‌ రైస్‌ (దంపుడు బియ్యం) తినవచ్చు. వైట్‌ రైస్‌ కూడా తినవచ్చు. బ్రౌన్‌ రైస్‌లో పీచు పదార్థం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దంపుడు బియ్యం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్రౌన్‌ రైస్‌ తినలేనివారు సమపాళ్ళలో బ్రౌన్‌ రైస్‌, వైట్‌ రైస్‌ కలిపి వండిన అన్నం తీసుకోవచ్చు. ఇది రుచిగానూ, ఎక్కువ తృప్తిగానూ ఉంటుంది.
**మీ నాలుగో ప్రశ్న
నష్టాలు ఏమీ రావు. రైస్‌లో బి విటమిన్లు ఉంటాయి. సేరిటోనిన్‌, మెలటోనిన్‌ హార్మోన్లను రైస్‌ ఉత్తేజితం చేస్తుంది. దీని వల్ల తెలియని ఉత్సాహంతో ఉండడం, శరీరం రిపేర్‌ అవడం జరుగుతాయి. రైస్‌లో ఉండే టైరొసిన్‌ అనే అమినో యాసిడ్‌ వెళ్ళి అడ్రినలిన్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌పై పనిచేసి, చురుకుదనం తెప్పిస్తుంది. మిత్యోనైన్‌ అమినో యాసిడ్‌ కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అల్సర్లు ఉన్నవారికి రైస్‌ ఉపశమనం కలిగిస్తుంది. ఎటువంటి జబ్బు చేసినా సరే రైస్‌తో తయారు చేసిన జావ, లేదంటే రైస్‌ గంజి ఇస్తే శక్తిని పుంజుకొని, తిరిగి ఆరోగ్యవంతులవుతారు. అన్నం తగినంత తీసుకోవాలి… అదే ఆరోగ్యానికి మంచిది. ఉన్నమాట చెప్పాలంటే, మనం మానాల్సింది అన్నం కాదు! అతిగా తినడం, అతిగా స్వీట్స్‌ తినడం, కొవ్వు పదార్థాలు ఎక్కువున్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చెయ్యకపోవడం!