* ఐరోపా సమాఖ్య (ఈయూ)తో వాణిజ్య ఒప్పందం తర్వాత బ్రిటన్ మరో అడుగు ముందుకేసింది. మరో కొత్త వాణిజ్య కూటమిలో చేరేందుకు సమాయత్తమవుతోంది. 11 సభ్య దేశాలు ఉన్న ‘కాంప్రిహెన్సివ్ అండ్ ప్రొగ్రెసివ్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్‌నర్‌షిప్ (సీపీటీపీపీ)’లో చేరేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు ప్రకటించింది. పసిఫిక్ ప్రాంతంలో ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రేలియా, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ, సింగపూర్, వియత్నాం, బ్రూనై దేశాల కూటమే ఈ సీపీటీపీపీ. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం విస్తృత వాణిజ్య ఒప్పందాలపై గురిపెట్టినట్లు తాజా నిర్ణయంతో అర్థమవుతోంది.
* కరోనా మహమ్మారి విజృంభణ అనంతరం కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు కేటాయింపుల వైపు ఆశగా ఎదరుచూస్తున్నారు. కరోనా వల్ల వివిధ రంగాల దెబ్బతిన్న వేళ తమ రంగానికి కేటాయింపులు జరపాలని, రాయితీలు ప్రకటించాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఇంతకీ ఈ బడ్జెట్ నుంచి పరిశ్రమ వర్గాలు ఏం ఆశిస్తున్నాయ్.. వాటి ఆకాంక్షలేంటో ఇప్పుడు చూద్దాం..
రియల్ ఎస్టేట్: ఈ సారి బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం భారీగానే ఆశలు పెట్టుకుంది. ఉపాధి కల్పనకు కేంద్రమైన ఈ రంగానికి కొన్ని రాయితీలు ప్రకటించాలని రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సంస్థ క్రెడాయ్ కోరుతోంది. ముఖ్యంగా గృహ రుణ చెల్లింపుల విషయంలో కొనుగోలుదారులకు సెక్షన్ 80సి కింద ఉన్న పరిమితిని పెంచాలని కోరుతోంది. అలాగే, నిర్మాణ వ్యయం పెరుగకుండా చర్యలు ఉండాలంటోంది.
హెల్త్, ఫార్మా: కరోనా వేళ ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పటికే ఫార్మా రంగంలో రారాజుగా పేరొందిన మన దేశంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) పరంగా మరింత ముందుకెళ్లాల్సి ఉందని ఆ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసం ఆర్‌అండ్‌డీపై చేసే ఖర్చుకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇవ్వాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నాయి. జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వాటా పెంచాలని బయోకాన్ లిమిటెడ్ చీఫ్ కిరణ్ మజుందర్ షా కోరుతున్నారు.
* కరోనా వైరస్ వ్యాప్తి ఆరోగ్య బీమా ప్రాధాన్యాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజెప్పింది. ఓ రకంగా వైద్యఖర్చుల భారం నుంచి తప్పించి.. ఆర్థికంగా కుంగిపోకుండా చేసింది. మొత్తంగా చూస్తే భారత్‌లో బీమా రంగం ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించలేదు. ప్రజలకు ఇంకా పూర్తి స్థాయి అవగాహన రాలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో బీమా రంగం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
* కరోనా.. లాక్‌డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గడపదాటి బయటకు రాలేదు. బయటకు వెళ్లేటప్పుడు వేసుకునే చెప్పుల కన్నా.. ఇంట్లో వేసుకునే చెప్పులే అరిగిపోయి ఉంటాయి. సోఫా షీట్లు, బెడ్ షీట్లు మాసిపోయి, హోమ్‌వేర్ దుస్తులు పాతబడిపోయి ఉంటాయి. వీటిని మారుస్తూ.. నచ్చినట్లు సొంతంగా డిజైన్ చేసే ఉంటారు. అలాంటి అనుభవం మీకు ఉన్నట్లయితే ‘బెడ్‌రూం అథ్లెటిక్స్’ కంపెనీ ఒక ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. నెలలో కేవలం రెండు రోజులు పనిచేస్తే చాలు.. ఏడాదికి రూ.4లక్షల జీతం ఇస్తామంటోంది.
* కేంద్ర బడ్జెట్ వస్తోందంటే కోటి ఆశలు మోసులెత్తుతాయి..! ఈసారైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందా? భారీ వరాల్లేకపోయినా, విభజన సమయంలో ఇచ్చిన హామీలనైనా కేంద్రం పూర్తిగా నెరవేరుస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూడటం, తీరా బడ్జెట్ చూశాక నిట్టూర్చడం అలవాటైపోయింది..! రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్లు గడిచిపోతున్నా… ఆంధ్రప్రదేశ్ ఇంకా బాలారిష్టాలను దాటలేదు. చేయి పట్టుకుని నడిపించాల్సిన కేంద్రం…. ఇచ్చిన హామీలనే పూర్తిగా నెరవేర్చడంలేదు. ఈసారి బడ్జెట్‌లోనైనా తమ ఆకాంక్షలు నెరవేరుతాయా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అమలు వంటి డిమాండ్‌లను నెరవేరుస్తుందా? అని మరోసారి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.