రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో 24 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు దక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన గడువు మేరకు ఆదివారం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. గడువుకు చివరి రోజు సహకార, పురపాలక, పరిశ్రమలు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులిచ్చారు. దీంతో పాటు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఆమోదించిన మరో వేయి మందికి సీఎం ఆమోదంతో త్వరలో పదోన్నతి కల్పించనున్నారు. అధికశాతం శాఖల్లో పదోన్నతులు వచ్చినా కీలకమైన విద్యా, పోలీసు తదితర శాఖల్లో కోర్టు కేసులు, సీనియారిటీ వివాదాల కారణంగా ఈ ప్రక్రియ జరగలేదు. దీనిని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని నిర్ణయించింది.
సాధారణ పదోన్నతుల ప్రక్రియ ఏడాదిలో రెండు దఫాలే సాగుతోంది. ప్రతి యేటా ప్యానల్ సంవత్సరంగా ఆగస్టు, డిసెంబరులలో డీపీసీలు నిర్వహించి, ఉత్తర్వుల జారీ ఆనవాయితీగా ఉంది. ఆ తర్వాత పదోన్నతులివ్వడం లేదు. ఈ అంశాన్ని ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేక కార్యక్రమంగా దీనిని చేపట్టాలని ఆదేశించారు. గతంలో పదోన్నతులకు కనీస సర్వీసు అర్హత మూడేళ్లు ఉండగా… రెండేళ్లకు కుదించాలన్న ఉద్యోగ సంఘాల వినతిని కూడా సీఎం అంగీకరించి, ఉత్తర్వులు జారీ చేయించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు 32 శాఖల్లో డీపీసీలు ఏర్పాటయ్యాయి. ఈ నెలాఖరు వరకు 24,201 మందికి పదోన్నతులిచ్చారు. అత్యధికం పురపాలక శాఖలో.. ఆ తర్వాత సంక్షేమ శాఖల్లో పదోన్నతులిచ్చారు.
విద్య, పోలీసు తదితర ప్రధాన శాఖల్లో పూర్తిస్థాయి పదోన్నతుల ప్రక్రియ జరగలేదు. సచివాలయంలోనూ ఇలాంటి వివాదమే ఉంది. దీంతో ఆయా శాఖల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా సీనియారిటీ పరంగా వివాదాల దృష్ట్యా పలు సంఘాలు, ఉద్యోగులు తమకు అనుకూల ఫలితాల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారని ప్రభుత్వం గుర్తించింది. తుది తీర్పు వచ్చే వరకు వేచి ఉంటే పదోన్నతుల్లో జాప్యం జరుగుతుందని భావిస్తోంది. వివాదాల పరిష్కారానికి ఆయా శాఖల పరిధిలో అంతర్గతంగా సంఘాలతో, ఉద్యోగవర్గాలతో సమావేశం నిర్వహించాలని యోచిస్తోంది. వివాదాలున్న శాఖల పరిధిలో అన్ని సంఘాల నేతలతో కార్యదర్శులు సమావేశాలు నిర్వహించి, పరిస్థితిని వివరిస్తారు. రాజీకుదిరితే పరస్పర అంగీకారంతో కోర్టుల్లో వ్యాజ్యాలను దాఖలు చేస్తారు. కోర్టుల నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదోన్నతుల ప్రక్రియ చేపడతారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పదోన్నతులపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. దీంతో పాటు అనేక శాఖల్లో ప్రక్రియ జరగకపోవడానికి కారణాలు, వాటి పరిష్కారానికి ప్రయత్నాలను ఆయన నివేదించనున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న 139 మంది ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆదివారం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి వారికి పోస్టింగ్‌లు కేటాయించారు. అయిదో జోన్‌లో 67, ఆరో జోన్‌లో 63, సిటీ కేడర్‌లో తొమ్మిది మందికి పదోన్నతి లభించింది. మొత్తం 182 మంది పదోన్నతికి అర్హులు కాగా…వారిలో 139 మందికి ఖాళీల మేరకు పోస్టింగ్ ఇచ్చారు. మరో ఒకట్రెండు నెలల్లో మరో 40 మందికి కూడా పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫాలో 943 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. ఇందులో దాదాపు 50 క్యాడర్లకు చెందిన ఉద్యోగులు లబ్ధి పొందారు. వైద్యుల క్యాడర్‌లో 100 మంది, పరిపాలన విభాగంలో 162 మంది, నర్సింగ్‌లో 150 మంది, పారామెడికల్ సిబ్బందిలో 483 మంది, గణాంక విభాగంలో 48 మంది పదోన్నతులు పొందారు. అర్హులైన అన్ని క్యాడర్ల ఉద్యోగులకు పారదర్శకంగా పదోన్నతులిచ్చామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. వైద్యశాఖ చరిత్రలో ఒక ప్యానల్ ఇయర్‌లో ఇంత భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించడం ఇదే తొలిసారని, ఈ క్రమంలో పలు ఇబ్బందులు ఎదురైనా ప్రజారోగ్య సంచాలకులు చొరవ తీసుకొని ప్రక్రియను నిరాటంకంగా కొనసాగించారని వైద్యఆరోగ్యశాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపల్లి రాజేందర్ హర్షం వెలిబుచ్చారు.
వైద్యవిద్య సంచాలకుల పరిధిలోనూ 200 మంది వైద్యులకు, ఇతర సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 125 మంది సహ ఆచార్యుల నుంచి ఆచార్యులుగా, 55 మంది సహాయ ఆచార్యుల నుంచి సహ ఆచార్యులుగా, 20 మంది ఇతర విభాగాల వారూ ఉన్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోనూ ఇప్పటి వరకూ 50 మందికి పదోన్నతులు కల్పించామని, మరో 750 మంది వైద్యులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన అనుమతి కోసం దస్త్రం సిద్ధమైందని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.