NRI-NRT

పుతిన్‌కు మూడింది

పుతిన్‌కు మూడింది

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అరెస్టుకు నిరసనగా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు నాలుగు వేల మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ నుంచి రష్యా వచ్చిన ప్రతిపక్ష నాయకుడు నావల్నీని జనవరి 17న రష్యా పోలీసులు అరెస్టు చేశారు. వచ్చే నెలలో ఆయనను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే నావల్నీకి దాదాపు మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో నావల్నీని విడుదల చేయాలంటూ ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు నావల్నీ ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో గత సంవత్సరం ఆయనపై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. అయితే, అధ్యక్షుడు పుతిన్‌ తనను హత్య చేయించేందుకు ప్రయత్నం చేసినట్లు వచ్చిన ఆరోపణలను క్రెమ్లిన్‌ ఖండించింది. అయితే, ప్రతిపక్ష నాయకుడి అరెస్టును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.