ఆదాయాలు పెరుగుతున్నా కూడా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ ప్రాసెసింగ్ సేవల (బీపీఎస్) విభాగంలో 5,000 మందిని తొలగించి, సిబ్బంది సంఖ్యను 38,000కు పరిమితం చేయాలని ఐటీ దిగ్గజం టెక్‌మహీంద్రా నిర్ణయించింది. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే అక్టోబరు-డిసెంబరులో ఆదాయం 11 శాతం పెరిగినా, ఇప్పటికే 2500 మంది సిబ్బందిని సంస్థ తొలగించేసింది. ఈ విధుల్లో యాంత్రీకరణ (ఆటోమేషన్), కృత్రిమమేధ (ఏఐ), అనలిటిక్స్‌ను అమలు చేయడంలో కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంతో, ప్రస్తుతం ఉన్నంతమేర సిబ్బంది అవసరం లేదనే భావనకు వచ్చింది. ఒక ఉద్యోగే, సాంకేతికత సాయంతో పలు విధులు నిర్వర్తించే అవకాశం లభించినందున, సంస్థ ఆదాయార్జనకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య పెరగాల్సిన అవసరం లేదని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. గతంలో వ్యాపార పొరుగు సేవలు (బీపీఓ) అంటే కాల్‌సెంటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సాంకేతికత సాయంతో, విదేశీ ఖాతాదారులకు కొన్ని రకాల సేవలను కూడా వీటితోనే అందించగలుగుతున్నారు. సిబ్బంది ఉత్పాదకత పెరిగినందున, ఆదాయంలో వృద్ధి లభించిందని టక్‌మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ సి.పి.గుర్నానీ తెలిపారు. కొవిడ్ వల్ల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నందున, కొన్ని అద్దె భవనాలను ఖాళీ చేసినట్లు వెల్లడించారు. ఖాతాదార్ల అవసరాలకు అనుగుణంగా 40 శాతం మంది వరకు సిబ్బంది కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సి వస్తోదని తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి 5జీ కంపెనీలతో కలిసి పనిచేయనున్నట్లు వివరించారు.
టెక్ మహీంద్రాలో 5000 మంది తొలగింపు
Related tags :