NRI-NRT

ఘనంగా సిలికానాంధ్ర స్నాతకోత్సవం

University of SiliconAndhra Third Graduation Ceremony

అంతర్జాల మాధ్యమం ద్వారా 2021 సంవత్సరపు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

జనవరి 30, 2021 శనివారం సాయంత్రం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గ మండలి, అధ్యాపకులు, విద్యార్థులు, దాతలు, శ్రేయోభిలాషులు అంతర్జాల స్నాతకోత్సవ సమావేశంలో పాల్గొన్నారు. 2021 సంవత్సరంలో పట్టభద్రులవుతున్న విద్యార్థులు (Class of 2021) సాధించిన విజయాలను ప్రతిఫలింపజేసుకొంటూ, విశ్వవిద్యాలయ అభివృద్ధికి అందించిన తోడ్పాటును తలచుకొంటూ, వారు మొదలెట్టబోతున్న నూతన రంగాల్లో విజయాలను అభిలషించారు.

మిల్పిటాస్, జనవరి 30, 2021 – సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులవుతున్న 2021 సంవత్సరపు విద్యార్థులను అభినందిస్తూ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ‘తాము సాధించిన విజయాలను చూసి గర్వపడాలని ‘ అన్నారు.

సభను ఉద్దేశిస్తూ, “భారతదేశ సంస్కృతి ఎంతో పురాతనమైనది. క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం తొలినాళ్లలోనే ప్రపంచ ప్రఖ్యాతినొందిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు నెలకొన్నాయి. ఎన్నో అడ్డంకులను, అవాంతరాలను ఎదుర్కొని 1916 సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని పండిత్ మదన్ మోహన్ మాలవీయ స్థాపించారు. ఇలాంటి మహనీయులనుండి స్ఫూర్తి పొందుతూ, సమిష్టి కృషితో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఒక శ్రేష్ఠమైన విద్యనొసగే ఆలయంలా తీర్చిదిద్దుకొందాం. భవిష్యత్తు మనది అన్న బలీయమైన నమ్మికతో ముందుకు సాగుదాం!’ అంటూ ప్రసంగించారు.

ముగిసిన ఈ సెమిస్టెర్ (Fall 2020)లో, కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం, భరత నాట్యం, సంస్కృతం కోర్సులలో భారతదేశం, ఉత్తర అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాలనుండి మొత్తం 38 మంది విద్యార్థులు డిగ్రీ, డిప్లమో పట్టాలను పొందారు. కుటుంబ సభ్యులతో వర్చువల్ సదస్సులో పాల్గొని ఆనందోత్సవాల్ని పంచుకొన్నారు.

“అత్యంత విలువైన ప్రాచీన భారతీయ కళలు, సాహిత్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ప్రతి ఒక్కరికి పారదర్శంగా అందిచండంలో సఫలీకృతమవుతున్నది సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం” అని ట్రస్టీస్ బోర్డ్ చైర్మన్, డా. పప్పు వేణుగోపాల్ అన్నారు.

స్నాతకోత్సవ ఉపన్యాసకుడు, యునైటెడ్ నేషన్స్ భారత రాయబారి, T.S. తిరుమూర్తి విశ్వవిద్యాలయ పత్రిక ‘శాస్త్ర’ ను ఆవిష్కరించారు. పట్టభద్రులను అభినందిస్తూ, “సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ పట్టభద్రులుగా బయట ప్రపంచంలో అడుగిడుతున్న మీరు భారతదేశపు చింతన, సంస్కృతి, సంప్రదాయ రాయబారులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. జ్ఞాన సముపార్జన, ఆత్మబోధనయే కేంద్రమైన భారతీయ సంస్కృతి మిగిలిన సంస్కృతులకంటే విభిన్నమైనది. భారతదేశపు విలువలకు అంతర్జాతీయ వేదికపై తగిన గుర్తింపు తేవడానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి జరుగుతున్నది” అని కొనియాడారు.

విశ్వవిద్యాలయ ప్రొవోస్ట్ చమర్తి రాజు తమ ప్రసంగంలో “గడిచిన నాలుగేళ్లలో సుదీర్ఘ ప్రయాణం జరిగింది. ఎన్నో మార్పులు జరిగాయి, కాని తపన మాత్రం చెక్కుచెదరలేదు. 2020 సంత్సరంలో విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం (Candidacy) లభించింది. త్వరలో గుర్తింపు హోదా (Accreditation) కూడా లభిస్తుంది” అంటూ ఆశావహం వ్యక్తం చేశారు.

చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ “విద్యార్థులకు వేతనం (Scholarships) ఇచ్చే దిశగా విశ్వవిద్యాలయం ప్రణాళికను రూపొందిస్తున్నది. మీరందరు మీ మాతృవిద్యా సంస్థతో సంబంధాలు కొనసాగించండి” అంటూ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

విశ్వవిద్యాలయ సామాజిక సంబంధాల సలహాదారుడు కొండిపర్తి దిలీప్ విద్యార్థులను అభినందిస్తూ వారు భవిష్యత్తులో ఎన్నో విజయాలను సాధించాలని ఆశించారు.

మారేపల్లి వెంకటశాస్త్రి గారి వేదప్రవచనంతో ప్రారంభమైన సదస్సులో చమర్తి జాహ్నవి అమెరికా జాతీయ గీతం ఆలపించింది. విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థుల సహకారంతో Dr. T.K.సరోజ స్వరపరిచిన స్నాతకోత్సవ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
University of SiliconAndhra Third Graduation Ceremony