* కరోనా మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం.. తమ పరిశోధనను ముమ్మరం చేసింది. వైరస్వ్యాప్తికి మూల కేంద్రంగా భావిస్తున్న వుహాన్‌లోని అతిపెద్ద మాంసాహార మార్కెట్‌ను ఆదివారం సందర్శించింది. ఈ మార్కెట్ కేంద్రంగానే లాక్‌డౌన్ సమయంలో చైనా ప్రభుత్వం వుహాన్‌లోని ప్రతి ఇంటికి ఆహారాన్ని చేరవేసింది. డబ్ల్యూహెచ్‌వో బృందంతో పాటు పెద్ద సంఖ్యలో చైనా అధికారులు, ప్రతినిధులు మార్కెట్ ప్రాంతానికి తరలివచ్చారు.
* మూడో రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్న నామినేషన్ కార్యక్రమానికి టెక్కలి వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ను హాజరయ్యారు. దీంతో ఇక్కడి నామినేషన్ కార్యక్రమానికి బయటి వ్యక్తులు రావడమేంటంటూ తెదేపా నేతలు, కార్యకర్తలు వారిని అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం తెదేపా కార్యకర్తల వైఖరి నిరసిస్తూ నిమ్మాడ కూడలిలో జాతీయ రహదారిపై వైకాపా శ్రేణులు బైఠాయించాయి.
* శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట సచివాలయం పరిధిలోని సీతారాంపురం నామినేషన్ కేంద్రంలో అధికారపార్టీ నేతలు హల్‌చల్ చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో హనుమంతునాయుడు పేట సర్పంచ్ స్థానానికి తెదేపా బలపరిచిన అభ్యర్థిని గౌతమి నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న వైకాపా నేతలు ఆమె వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. ఈ క్రమంలో వైకాపా నేత సుగ్గు రామిరెడ్డి వర్గీయులు భౌతిక దాడికి దిగినట్లు తెదేపా కార్యకర్తలు బాలస్వామి, రాము, కర్రయ్య ఆరోపించారు. కుల, ఆదాయ ధ్రువపత్రాలతో పాటు ఇతర పత్రాలను తీసుకెళ్లిపోయినట్లు తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా బాధితులతో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. నామినేషన్ వేయించాలని ఎస్సైలు మహమ్మద్ యాసిన్, మధుసూదనరావును ఆయన ఆదేశించారు.
* ప్రముఖ దర్శకుడు శంకర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేశారు. తాను రచించిన ‘జిగుబా’ కథను కాపీ కొట్టి శంకర్ ‘రోబో’ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొంటూ కొన్నేళ్ల క్రితం ప్రముఖ రచయిత అరుర్ తమిళ్‌నందన్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో శంకర్ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం పలుమార్లు ఆదేశించినా.. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా ఆయన న్యాయస్థానం ఎదుట కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన పేరుమీద తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. అలాగే ఈ కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది.
* పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో భాజపా అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే కాకుండా.. అభివృద్ధి పథంలోనూ నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నడ్డా ఆదివారం పుదుచ్చేరిలో నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా పెరిగిపోయిందని విమర్శలు చేశారు.
* రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ అరెస్టుకు నిరసనగా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మద్దతుదారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు నాలుగు వేల మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
* తృణమూల్ నేతలు భాజపాలో చేరడానికి మమతా ప్రభుత్వం వైఫల్యమే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల కాలం కంటే దారుణ పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తుంటే, బెంగాల్‌లో దీదీ మాత్రం తన అల్లుడి కోసం మాత్రమే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయం నాటికి దీదీ వైపు ఏ ఒక్కరూ మిగలరన్న ఆయన.. రాబోయే రోజుల్లో భాజపాలోకి మరిన్ని వలసలు ఉంటాయనే సంకేతమిచ్చారు. దీంతో మమతా బెనర్జీ తన ప్రభుత్వ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో దోపిడి, అవినీతి పాలన కొనసాగుతోందని విరుచుకుపడ్డ అమిత్ షా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు. హౌరాలో జరిగిన పార్టీ బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
* పంచాయతీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. తొలిదశ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు కావడంతో అన్ని స్థానాల్లో నామినేషన్ వెయ్యాలని సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని ఆదేశించారు. బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్థులను భయపెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రలోభపెట్టాలని చూస్తే తిప్పి కొట్టాలని, వాటిపై ఎక్కడిక్కడ ఫిర్యాదు చేయాలని సూచించారు. వైకాపా గూండాల చేతిల్లోకి వెళ్తే.. గ్రామాలకు కన్నీరే మిగులుతుందన్నారు.వైకాపా నాయకులు గ్రామాలను కక్షలు కార్పణ్యాలకు వేదికలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికీ గుణపాఠం చెప్పే అవకాశం ఈ ఎన్నికల ద్వారా వచ్చిందని చంద్రబాబు సూచించారు. ఎవరి బెదిరింపులకూ భయపడాల్సిన పని లేదని, ధైర్యంగా ముందుకొచ్చి నామినేషన్లు వేయాలని పిలుపునిచ్చారు. వైకాపా గూండాల బారి నుంచి పార్టీలను మీరే కాపాడు కోవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.