* 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఆత్మ నిర్భర్ భారత్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏయే ధరలు తగ్గుతాయో ఓ సారి పరిశీలిస్తే..ధరలు పెరిగేవి…తాజా బడ్జెట్‌తో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు పెరిగే అవకాశముంది. ఎల్‌ఈడీ బల్బులు, సర్క్యూట్ బోర్డులు, వాటి విడి భాగాలు, సోలార్ ఇన్వెర్టర్స్, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రానున్నాయి. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్ బ్యాటరీ ధరలు మరింత పెరిగే అవకాశముంది. విలువైన రాళ్లు, రత్నాలు ధరలు కూడా పెరుగుతాయి. ఆటో మొబైల్ విడి విభాగాల ధరలు పెరగవచ్చు. విండ్ స్క్రీన్స్, సిగ్నలింగ్ పరికరాల ధరలు పెరుగుతాయి. ఇంక్ క్యాట్రిడ్జ్‌లు, ఇంక్ స్ప్రే నాజిల్స్, లెథర్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి. ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ వస్తుల ధరలు కూడా పెరిగే అవకాశముంది. వంటనూనె ధరలు పెరుగుతాయి. ధరలు తగ్గేవి…దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. ప్లాటినం, పల్లాడియం ధరలు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గుతాయి. ఇనుము, ఉక్కు, రాగి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. నైలాన్ దుస్తుల ధరలు తగ్గనున్నాయి.
* ట్యాక్స్ మినహాయింపులతో పాటు అధిక వడ్డీని పొందేందుకు కొందరు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్)ను వినియోగించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ సారి బడ్జెట్‌లో చేదు వార్త. ఏడాదిలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉద్యోగి వాటా (12శాతం), వీపీఎఫ్ కింద జమ అయ్యే మొత్తాలపై ఇక పన్ను భారం పడనుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన దానికంటే అధికంగా జమ చేసిన మొత్తాలపై వచ్చే వడ్డీపై ఈ పన్ను విధించనున్నారు. అయితే, ఉద్యోగి వాటాను మాత్రమే లెక్కించనున్నారు.
* రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందుబాటు ధరల్లో గృహాల కొనుగోలుపై అదనంగా ఇచ్చే రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. వచ్చే 2022 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు ఈ రాయితీ వర్తిస్తుంది.
* కేంద్ర బడ్జెట్-2021లో హోంమంత్రిత్వ శాఖకు రూ.1.66లక్షల కోట్లు కేటాయించారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. హోంశాఖకు కేటాయించిన నిధుల్లో అధిక మొత్తం.. దాదాపు రూ.1.03లక్షల కోట్లు పోలీసు బలగాలకే(సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్) వెళ్లనున్నాయి. అత్యధికంగా కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌కు రూ.30వేల కోట్లు, లద్ధాఖ్‌కు రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా గతేడాది జనాభా లెక్కలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కాబట్టి జనాభా లెక్కల కార్యక్రమం కోసం రూ.3,768కోట్లు ప్రకటించారు. అంతేకాకుండా హోంమంత్రిత్వ శాఖ పరిధిలో నిర్వహించే కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రూ.1,641 కోట్లు, విపత్తు నిర్వహణల కోసం రూ.481 కోట్లు కేటాయించారు.
* ఏపీ ప్రభుత్వం తాము చేయాల్సిన పనులు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తోందని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేయకుండా పక్కన పెడుతున్నారని ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల కొన్ని పనులు ముందుకెళ్లడం లేదని విమర్శించారు.ప్రత్యేక హోదాను ఒక ఆయుధంలా వాడుకోవాలని వైకాపా చూస్తోందని టీజీ ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఉన్న తెదేపా ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకొని వెనక్కి తగ్గిందని.. ఇప్పుడున్న వైకాపా ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదన్నారు.
* కరోనా సంక్షోభంలోనూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. పన్నులు పెంచకపోవడం మంచి పరిణామమన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై సోమవారం సాయంత్రం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. వైద్యరంగానికి ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగామన్నారు.
* కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. భారతదేశానికి చెందిన ఆస్తులను ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెడుతోందంటూ ధ్వజమెత్తారు. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడం మర్చిపోయిన మోదీ ప్రభుత్వం.. తన మిత్రులైన పెట్టుబడిదారులకు దేశం ఆస్తులను అప్పగించేందుకు ప్రయత్నిస్తోందంటూ ట్వీట్ చేశారు.
* కేంద్ర బడ్జెట్‌లో మహారాష్ట్రను విస్మరించారంటూ శివసేన మండిపడింది. దేశానికి ఎక్కువ ఆదాయం సమకూర్చే ముంబయి నగరానికి కేటాయింపుల్లో ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్‌లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారని మండిపడ్డారు. దేశాన్ని ప్రయివేటీకరణ దిశగా తీసుకెళ్లేదిగా ఈ బడ్జెట్ ఉందని ఎన్సీపీ తెలిపింది. సామాన్య ప్రజలను నిర్లక్ష్యం చేశారని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. రైతులకు సంబంధించి కూడా సరైన నిర్ణయాలేమీ లేవన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ బడ్జెట్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.
* బడ్జెట్‌లో ఈ సారి కొత్త సంక్షేమ పథకాల జాడ కనిపించలేదు. కొవిడ్ ప్రభావంతో రాబడి తగ్గిపోయింది. రెవిన్యూ లోటు ఎకాఎకీన పెరిగింది. ప్రజారోగ్యం, కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి భారీగా ఖర్చుచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మిగతా ఖర్చులూ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆర్భాటం కోసం కొత్త పథకాలు తీసుకురాలేదు. ఉన్నవాటికే ఆచితూచి కేటాయింపులు చేశారు. బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన తరగతుల కోసం ప్రత్యేకించి రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. రుణ కల్పన పైనా ఏమీ మాట్లాడలేదు. అందుకే రూ.34,83,236 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత బడ్జెట్ సవరించిన అంచనాలతో పోలిస్తే దాదాపుగా రూ.32,000 కోట్లే ఎక్కువ. ఫర్టిలైజర్లు, ఆహారం, పెట్రోలియం మీద సబ్సిడీని బాగా తగ్గించారు. గతేడాది సవరించిన బడ్జెట్ అంచనాలతో పోలిస్తే కేంద్ర పథకాలకు కోత పడింది. అప్పట్లో రూ.12,63,690 కోట్లు ఉండగా ఇప్పుడు రూ.10,51,703 కోట్లు కేటాయించింది. కాగా ‘అందరికీ ఇల్లు’ నేపథ్యంతో ఇంటి కొనుగోలుదారులకు వడ్డీ మినహాయింపును మరో ఏడాది పొడిగించడం గమనార్హం.
* కరోనాతో ఆర్థిక ప్రగతిపై తీవ్ర ప్రభావం పడిందని, ఇప్పుడిప్పుడే చాలా రంగాలు తిరిగి పుంజుకుంటున్న సమయంలో రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వైకాపాకు 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోతున్నారని ఆరోపించారు. పోలవరం, విభజన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతరత్రా ప్రాధాన్య అంశాలపై ఈ బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కరోనా సంక్షోభం తర్వాత మునుపెన్నడూ చూడని బడ్జెట్ చూస్తామనుకున్న వారి అంచనాలు పూర్తిగా తప్పాయన్నారు. బడ్జెట్‌లో చాలా మంచి అంశాలు పొందుపర్చినప్పటికీ ఏపీకి సంబంధించి మాత్రం నిరాశాజనకంగా ఉందని తెలిపారు.
* బడ్జెట్ ప్రకటన వేళ దేశీయ మార్కెట్లో బంగారం ధర అమాంతం పడిపోయింది. సోమవారం ఒక్కరోజే రూ. 1,324 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ. 47,520గా ఉంది. అయితే ఇదే సమయంలో వెండి ధర భారీగా పెరగడం గమనార్హం. దీంతో కేజీ వెండి ధర రూ.70వేల మార్క్‌ను దాటింది. బులియన్ మార్కెట్లో నేడు కేజీ వెండి ధర రూ. 3,461 పెరిగి రూ. 72470 పలికింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రకటన చేసిన రోజే ఈ లోహాల ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం గమనార్హం.