Food

క్రాన్‌బెర్రీ కాక్‌టెయిల్ తాగుతున్నారా?

క్రాన్‌బెర్రీ కాక్‌టెయిల్ తాగుతున్నారా?

ఎర్రగా చెర్రీలను పోలివుండే క్రాన్‌ బెర్రీలో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా హెలికో బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ను ఇది తగ్గిస్తుంది. యాంటీ బయాటిక్‌ ట్యాబ్లెట్లను తరచూ వాడేవారిలో, ఈతరహా ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇరవై లక్షల మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఆ బ్యాక్టీరియా వల్ల పొట్టలో ఏర్పడే పుండ్లు, మంట, ఉబ్బరం, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలకు క్రాన్‌బెర్రీ జ్యూస్‌ చక్కని పరిష్కారమని అంటున్నారు నిపుణులు. రోజూ 240 మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన క్రాన్‌బెర్రీ జ్యూస్‌ తాగడం వల్ల పొట్టలో పుట్టే సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ఎంజైములు అందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మహిళల్ని పట్టిపీడించే సమస్య.. యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌. క్రాన్‌బెర్రీలో పుష్కలంగా ఉండే విటమిన్‌- సి, కె, ఇ యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. పురుషులతో పోల్చితే మహిళల్లో చాలా త్వరగా ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. అందుకే మహిళలు క్రాన్‌బెర్రీ జ్యూస్‌ని నిత్య ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ జ్యూస్‌లో ఎక్కువగా ఉండే, ఆర్గానిక్‌ యాసిడ్స్‌ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, బరువు తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఇన్ని ప్రయోజనాలున్న క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను మీరూ నిత్యం సేవించండి.