తెలుగు రాష్ర్టాలను విస్మరించి ఎన్నికలు జరుగబోతున్న రాష్ర్టాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘రైతన్న’. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్‌ను తలపిస్తుంది. బడ్జెట్‌లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశాన్ని ప్రస్తావించలేదు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సూచించిన ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలను కుప్పకూల్చి ప్రైవేటుపరం చేస్తే కార్పొరేట్ శక్తులు పంచభూతాలను కూడా అమ్ముకుంటాయి. అప్పుడు సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. ఈ అంశాలను చర్చిస్తూ రైతు సమస్యల నేపథ్యంలో ‘రైతన్న’ సినిమాను రూపొందిస్తున్నాను. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా’ అని తెలిపారు.
బడ్జెట్‌పై నారాయణమూర్తి ఆవేదన
Related tags :