Kids

అక్బర్…నూనె కథ

అక్బర్…నూనె కథ

అక్బర్‌ రాజ్యంలోని ఓ పల్లెటూరులో ఒక నూనె వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు ఆ వ్యాపారి, ఓ గ్రామస్థుడు డబ్బు సంచీ తనదంటూ తనది అంటూ గొడవపడ్డారు. చివరకు న్యాయం చేయాలని కోరుతూ ఇద్దరు అక్బర్‌ దగ్గరకు వచ్చారు. అప్పటికే సభలో ఆసీనుడై ఉన్న అక్బర్‌ విషయం ఏంటని అడిగాడు.

‘ఈ డబ్బు సంచీ నాది. గ్రామస్థులకు నూనె అమ్మగా వచ్చిన డబ్బులను ఇందులో పెట్టాను’ అని నూనె వ్యాపారి అన్నాడు.

ఇంతలో ‘ఆ డబ్బు సంచీ నాది. నూనె కొనడం కోసం వచ్చినపుడు సంచీ అక్కడ మర్చిపోయాను. నా సంచీ నాకు ఇప్పించండి’ అని గ్రామస్థుడు మొరపెట్టుకున్నాడు.

సమస్యను విన్న అక్బర్‌ పరిష్కరించమని బీర్బల్‌ను కోరాడు. బీర్బల్‌ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అని సభలో అందరూ ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టారు.

ఒక చెంబులో నీళ్లు తీసుకుని రమ్మని ఓ వ్యక్తిని పురమాయించాడు బీర్బల్‌. ఆ నీళ్ల చెంబును సంచీలో పెట్టాడు. కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్నాడు. సభలో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాసేపయ్యాక చెంబు బయటకు తీసి ఈ సంచీ నూనె వ్యాపారిదే అని తేల్చాడు. ఎలా చెబుతున్నావు? అని అక్బర్‌ అడిగితే ‘జహాపనా! ఈ నీళ్లు చూడండి. నూనె మరకలు కనిపిస్తున్నాయి. అంటే ఈ సంచీ నూనె వ్యాపారిదే ’’ అని చెప్పాడు. బీర్బల్‌ తెలివితేటల్ని అక్బర్‌ మెచ్చుకున్నాడు.

డబ్బు మీద ఆశతో అబద్దం ఆడినందకు ఆ గ్రామస్థున్ని శిక్షించాల్సిందిగా ఆదేశించాడు.