Business

అమ్మకానికి విశాఖ స్టీల్ ప్లాంట్-వాణిజ్యం

Business News - Vizag Steel Plant Is Up For Sale 100 Percent

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం కాబోతుంది. ప్లాంట్‌లో 100 శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ నుంచి వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినేట్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఆమోదించింది.

* ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్‌ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. దేశంలో ఇప్పటికే నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుంటే తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర సెగలు మరో షాకిచ్చాయి. బడ్జెట్‌ రోజు ఫిబ్రవరి 1న వంట గ్యాస్‌ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (గురువారం)నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్‌‌ సిలిండర్‌ కూడా గుదిబండగా పరిణమించింది.

* దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పసిడి ధర తగ్గుముఖం పట్టింది. గురువారం రూ.322 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన(24 క్యారెట్లు) పుత్తడి రూ. 47,135 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 68వేల దిగువకు పడిపోయింది. రూ. 972 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 67,170గా ఉంది.

* దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ నికర లాభం కుంగింది. గురువారం కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి ఫలితాలను వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వచ్చిన ఫలితాలతో పోలిస్తే 6.9శాతం నికర లాభం తగ్గి రూ.5,196.22 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా మొండిబకాయిల కోసం భారీగా ప్రొవిజన్లు ఏర్పాటు చేయాల్సిరావడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది. గతేడాది ఇదే సమయంలో ఎస్‌బీఐ రూ.5,583.4 కోట్ల మేరకు నికర లాభాన్ని ఆర్జించింది.

* దేశీయ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా 1,577 థార్‌ ఎస్‌యూవీ డీజిల్‌ యూనిట్లను రీకాల్‌ చేసినట్లు గురువారం తెలిపింది. వీటి ఇంజిన్లలో సమస్యలు ఉండటంతో వాటిని మార్చేస్తున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి డిసెంబర్‌ 25వ తేదీ మధ్య తయారు చేసిన ఈ వాహనాల్లో కామ్‌షిఫ్ట్‌ వ్యవస్థలో లోపాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా పరిశీలించి అవసరమైన మార్పులు చేయనుంది.