“పిల్లి చేతకానిదైతే ఎలుక వెక్కిరించిందన్న” సామెత ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. వివిధ క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉండి కోర్టులు చుట్టూ తిరుగుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కేంద్ర ప్రభుత్వంతో రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నప్పటి జగన్ నోరు మెదపలేకపోతున్నారు. పార్లమెంటులో, ఉభయ సభల్లో 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారంతా ఉత్సవ విగ్రహల్లాగానే ఉంటున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేకపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను అటకెక్కించారు. మొన్న పార్లమెంటులో పెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఏపీకి కేటాయించలేదు. ప్రస్తుతం తాజాగా విశాఖ ఉక్కును ప్రేవేటీకరించడానికి ప్రధాని మోడీ కుయుక్తులు పన్నుతున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ‘అగ్గిమీద గుగ్గిలం’ లాగా మండిపోతున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకపోగా ఉన్న ఉక్కు కర్మాగారం కూడా ప్రెవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం వెనుక పెద్ద కుట్రే ఉన్నదని తెలుగు ప్రజలు భావిస్తున్నారు.
* విశాఖ ఉక్కు కోసం ఎందరో బలిదానం చేశారు
విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం తెలుగు ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అంటూ ఏళ్ల తరబడి సాగిన పోరాటంలో 50 మందికి పైగా ప్రజలు వివిధ ఉద్యమాల్లో నేలకొరిగారు. విశాఖ చుట్టుపక్కల ఉన్న 52 గ్రామాల ప్రజలు వేళాది ఎకరాల భూమిని విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వదులుకున్నారు. కాకాని వెంకటరత్నం లాంటి ఎందరో మహానుభావులు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమాలు నడిపి దానిని సాదించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రెవేట్ పరం చేస్తామని ప్రకటించడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.
* విశాఖలో ప్రారంభమైన ఉద్యమం
కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఉత్తరాంద్ర నుండి ఉవ్వెత్తున ఉద్యమం మొదలైంది. శుక్రవారం నాడు విశాఖలో అక్కడే ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాటాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆంధ్రుల మనోభావాలను గుర్తించి ప్రెవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీగా మూల్యం చెల్లించక తప్పదు. –కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.