NRI-NRT

ఆస్ట్రేలియా భర్తను జైల్లో వేసిన నల్గొండ పోలీసులు-నేరవార్తలు

ఆస్ట్రేలియా భర్తను జైల్లో వేసిన నల్గొండ పోలీసులు-నేరవార్తలు

* నూరేళ్లు కలిసి జీవిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి.. ఓ యువతి మెడలో మూడు ముళ్లు వేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయిన యువకుడిని నల్గొండ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఆ ప్రబుద్ధుడిని అక్కడి నుంచి రప్పించి విమానం దిగగానే అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన ఓ యువతి వివాహం గతేడాది ఆగస్టు 6న ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌లోని జీడిమెట్ల పద్మారావునగర్‌కు చెందిన మందుగుల సురేష్‌తో జరిగింది. పెళ్లి అయిన 15 రోజుల తర్వాత ఆస్ట్రేలియా బయలుదేరిన సురేష్‌ కొద్దిరోజుల్లో భార్యను అక్కడికి తీసుకెళతానని చెప్పాడు. అప్పటినుంచి అత్తగారింట్లో ఉన్న ఆ యువతిని ఆడపడుచు, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. దీనిపై సురేష్‌కు ఆయన భార్య ఎన్నిసార్లు చెప్పినా స్పందన కొరవడింది. దీంతో బాధితురాలు నల్గొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ రాజశేఖర్‌గౌడ్‌ను సంప్రదించారు. ఆయన నల్గొండ ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌ ద్వారా ఆస్ట్రేలియా ఎంబసీ సహకారంతో సురేష్‌ పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ సంస్థకు మెయిల్‌ పెట్టారు. ఆ తర్వాత సంస్థ నిర్వాహకులకు ఫోన్‌లో విషయం వివరించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించేలా చేశారు. అనంతరం సురేష్‌ భారత్‌ వచ్చేలా ఒత్తిడి తెచ్చారు. ఈనెల 2న దిల్లీ విమానాశ్రయంలో సీఐ రాజశేఖర్‌గౌడ్‌… ఇమ్రిగేషన్‌, విమానాశ్రయ అధికారుల సహకారంతో సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

* పెళ్లయిన రెండు నెలలకే భార్యను హత్య చేసిన ఓ భర్త.. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ ప్లే నడిపించాడు. అనంతరం పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం అయ్యవారి గూడెంకు చెందిన ఎర్రమాల నవ్యా రెడ్డి(20)కి తన సొంత బావ నాగశేషురెడ్డితో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. అయితే బీటెక్‌ చదువుతున్న తన భార్య కనిపించడం లేదంటూ నాగశేషురెడ్డి ఈనెల 3న పెనుబల్లి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అంతకుముందు రోజు సత్తుపల్లి సమీపంలోని కళాశాలకు నవ్యా రెడ్డి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తులో భాగంగా పెనుబల్లి మండలం కుప్పెనగుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా మృతురాలు ఈనెల 2న భార్త నాగశేషురెడ్డితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు.. నాగశేషును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చివరకు భార్యను తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. ఈనెల 2న తన భార్యకు పండ్లరసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి కుక్కలగుట్ట శివారులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లాక చున్నీతో చెట్టుకు ఉరివేసినట్లు వెల్లడించాడు. అనంతరం నవ్యా రెడ్డి మొబైల్‌ నుంచి ఆమె తండ్రికి ఇంజినీరింగ్‌ బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్‌ పంపినట్లు తెలిపాడు. ఈ మేరకు అదనపు ఎస్పీ మురళీధర్‌, వైరా ఏసీపీ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలం నుంచి నవ్యా రెడ్డి మృతదేహాన్ని పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. వేరే యువతితో నాగశేషుకు ఉన్న ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు నవ్య బంధువులు ఆరోపిస్తున్నారు.

* మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్‌ సన్నిహిత బంధువు సిద్ధార్థ సింగ్‌ (28) హత్య కేసులో అతని సవతి తల్లి ఇందూ చౌహాన్‌ను అమృతహళ్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సిద్ధార్థ తండ్రి దేవేందర్‌ సింగ్‌కు ఇందూ చౌహాన్‌ రెండో భార్య. తిరుపతికి చెందిన శ్యామ్‌సుందర్‌ రెడ్డి, వినోద్‌లకు ఆమె కిరాయి ఇచ్చి హత్య చేయించిందని విచారణలో గుర్తించి అరెస్టు చేశామని బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ సి.కె.బాబా తెలిపారు. బుధవారం రాత్రే ఆమెను పోలీసులు నిర్బంధించి, న్యాయస్థానం ముందు గురువారం ఉదయం హాజరు పరిచి అరెస్టు చేశారు. జనవరి 19న సిద్ధార్థ సింగ్‌ను అపహరించి, కారులోనే సీటు బెల్టుతో గొంతుకు ఉరి వేసి నిందితులు హత్య చేశారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకువెళ్లి రాపూరు సమీప నల్లమల అటవీ విభాగంలో పూడ్చి పెట్టారు. అక్కడి తహసీల్దారు సమక్షంలో శవాన్ని వెలికి తీసి, పంచనామా చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమెరికాలో చదువుకున్న సిద్ధార్థ అమృతహళ్లి పరిధిలోని దాసరహళ్లి అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండేవారు. ఆయన ఒక అంకుర పరిశ్రమను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. హత్య వెనుక మరికొందరి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. వ్యక్తిగత కక్షలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

* జాతీయ పతాకాన్ని అవమానించారని.. మరణించిన ఓ రైతు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బల్విందర్‌ సింగ్‌ అనే రైతు యూపీలోని భోపత్‌పూర్‌ గ్రామానికి చెందిన వారు. జనవరి 23న గాజీపూర్‌కు చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి దిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు.. దిల్లీ పోలీసులు ఆయన కుటుంబానికి ఫోన్‌ ద్వారా తెలియజేశారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆస్పత్రిలో శవపరీక్ష అనంతరం, సింగ్‌ మృతదేహాన్ని అప్పగించారు. బల్విందర్‌ సింగ్‌ మృతదేహానికి బుధవారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన శరీరంపై జాతీయ పతాకాన్ని కప్పారు. అయితే ఈ చర్య ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌’ ప్రకారం విరుద్ధమని.. ఈ కారణంగా ఆయన భార్య, సోదరుడు, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సెరామావు నార్త్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు.

* పిడుగురాళ్ల స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ కేసులో నలుగురిని అరెస్టు చేసి కోర్టులు పరిచినట్టు పట్టణ సీఐ ప్రభాకర్‌ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన పల్లపు ప్రసాద్‌, బిర్లంగి నేతాజీ సుభాష్‌, బెండి సతీష్‌, బుడ్డి ప్రసన్నకుమార్‌… గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చెన్నూరి మహేష్‌కు పిడుగురాళ్లలో అమ్మకానికి ప్లాట్లు ఉన్నాయని, వస్తే చూపిస్తామని చెప్పారు. వారి మాటలు నమ్మి మహేష్ కుమార్‌ డిసెంబరు 15న పిడుగురాళ్ల పట్టణంలోని ఆయేషా దాబా వద్దకు వచ్చారు. కాసేపటికి కిడ్నాప్‌ చేసి హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌ ప్రాంతానికి కారులో తీసుకెళ్లి ఒక గృహంలో బంధించి కొట్టారు. రూ.75లక్షలు డిమాండ్‌ చేయగా రూ.19లక్షల నగదు వారికి అందజేశారు. ఆ తర్వాత రెండు విడతలుగా రూ.12లక్షలు, రూ.13లక్షలు నగదు ఇవ్వడంతో వదిలేశారు. ఘటనపై జనవరి 23న పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో మహేష్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను గురువారం అరెస్టు చేసి వారి వద్ద ఉన్న రూ.15లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ప్రభాకర్‌ తెలిపారు. నలుగురిని ఇవాళ కోర్టులో హాజరుపర్చారు.

* నలుగురైదుగురు కలిసి దుకాణానికి ఒకేసారి వస్తారు. నిజంగా దుస్తులు కొనేందుకు వచ్చినట్లు హంగూ ఆర్భాటం చూపిస్తారు. ఒకరిద్దరు సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి చీరలు బేరమాడుతుంటారు. మరోవైపు మిగిలిన వాళ్లు దొరికినకాడికి చీరలను చాకచక్యంగా దుకాణం దాటించేస్తారు. ఇది ఏ సినిమాలోనో జరిగిన దొంగతనం కాదండీ. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర శారీ సెంటర్‌లో పట్టపగలే ఈ చోరీ జరిగింది.