అమెరికాలో మోసాలకు పాల్పడి శిక్షకు గురైన ఓ యువకుడు తన సోదరుడి పేరుతో ఓ పాస్‌పోర్టు తయారుచేయించి దాని సాయంతో అక్కడి అధికారుల కళ్లు గప్పి ఇండియాకు చేరుకున్నాడు. చివరకు ఇక్కడ పట్టుబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మొర్రిశెట్టి రవి 2016 నుంచి అమెరికాలో ఉంటూ హెల్త్‌కేర్ ప్రాజెక్టు బిజినెస్ చేశాడు. ఆ వ్యాపారంలో మోసానికి పాల్పడటంతో అక్కడి పోలీసులు రవిని అరెస్టు చేసి పాస్‌పోర్టు సీజ్ చేశారు. కోర్టు అతడికి రెండేళ్ల శిక్షతోపాటు రూ. 7 లక్షల పైచిలుకు డాలర్ల జరిమానా విధించింది. అప్పీలుపై బయటకు వచ్చిన నిందితుడు ఈ శిక్ష నుంచి తప్పించుకుని స్వస్థలానికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అతడి సోదరుడైన మొర్రిశెట్టి రవికిరణ్ కారేపల్లిలో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. తన పేరుకు దగ్గరగా ఉండడంతో అతడి పేరుతో పాస్‌పోర్టు సంపాదించాడు. అనంతరం తల్లిదండ్రుల ద్వారా ఆ పాస్‌పోర్టును అమెరికాకు రప్పించుకున్నాడు. దాని ఆధారంగా రవి 2020లో కారేపల్లికి చేరుకున్నాడు. అమెరికాలో ఉండగానే రవికి కర్నూలుకు చెందిన బి.అశోక్ అనే వ్యక్తితో స్నేహం ఉండేది. అక్కడ ఉండగానే రకరకాల కారణాలు చెప్పి అతడి వద్ద 1.56 లక్షల డాలర్లు అప్పు తీసుకున్నాడు. తర్వాత కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన అశోక్ కర్నూలులోనే ఉంటున్న తన సోదరుడు క్షత్రపతికి ఈ విషయం తెలిపాడు. ఆయన గత ఏడాది జూన్‌లో ఖమ్మం కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. దానిపై పోలీసులు విచారించడంతో రవి బండారం బయటపడింది. దీంతో కారేపల్లి పోలీసులు రవి సోదరులను గురువారం అరెస్టు చేసి ఇల్లెందు కోర్డుకు రిమాండ్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
అమెరికా నుండి నకిలీ పాస్‌పోర్ట్‌పై ఇండియాకు పరారీ
Related tags :