Politics

₹50వేలు మాత్రమే విరాళం ఇచ్చిన సోనియా

₹50వేలు మాత్రమే విరాళం ఇచ్చిన సోనియా

కాంగ్రెస్‌ పార్టీ విరాళాల్లో అధినేత్రి సోనియా గాంధీ, ముఖ్య నేత రాహుల్‌ గాంధీ కన్నా రెబల్‌ నేతలే ఎక్కువ డొనేషన్లు ఇచ్చారు. 2019-20 ఏడాదిలో కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాల వివరాలను గత వారం భారత ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీని ప్రకారం పార్టీ అధ్యక్షురాలు సోనియా రూ.50,000 మాత్రమే పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఇక రాహుల్‌ గాంధీ రూ.54,000 అందజేశారు. మరోవైపు పార్టీ అధిష్ఠానంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన 23 మంది సీనియర్‌ నేతలు సోనియా, రాహుల్‌ కన్నా ఎక్కువ నిధులను పార్టీకి ఫండ్‌గా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో అందరి కంటే అత్యధికంగా కపిల్‌ సిబల్‌ రూ.3 కోట్లు విరాళంగా అందజేశారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన రాజ్ బబ్బర్ పార్టీ నిధికి రూ.1.08 లక్షలు ఇవ్వగా, మిలింద్ డియోరా లక్ష, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్ కూడా రాహుల్‌తో సమానంగా ఒక్కొక్కరు రూ.54 వేలు చొప్పున అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి సమర్పించిన విరాళాల జాబితాలో ఎక్కువ మంది నేతలు రూ.54 వేలు ఇవ్వడం గమనార్హం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, దివంగత నేత మోతీలాల్ వోరా, దివంగత నేత అహ్మద్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి ప్రీనీత్ కౌర్, అధీర్ రంజన్ చౌదరి తదితరులు రూ. 54,000 చొప్పున పార్టీకి డొనేషన్లు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా కూడా రూ.54 వేలు విరాళంగా ఇచ్చారు. మరోవైపు విరాళాల నివేదిక ప్రకారం 2019-20లో కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ.139 కోట్ల డొనేషన్లు స్వీకరించింది. టెలికాం మేజర్ భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.31 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఐటీసీ రూ.13 కోట్లు, ఐటీసీ ఇన్ఫోటెక్ రూ.4 కోట్ల డొనేషన్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2018-19లో కాంగ్రెస్‌కు రూ.146 కోట్ల విరాళాలు అందాయి. కాగా, వ్యక్తులు, సంస్థల నుండి రూ.20 వేలకు మించి అందిన విరాళాలను రాజకీయ పార్టీలు ప్రతి ఏటా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి. కాంగ్రెస్‌ పార్టీతోపాటు ఎన్సీపీ, బీఎస్పీ తమకు అందిన డొనేషన్ల నివేదికలను ఈసీకి సమర్పించగా వాటిని వెబ్‌సైట్లోలో ఉంచారు. కాగా రూ.20 వేలకు మించిన విరాళాలు ఒక్కటి కూడా తమకు అందలేదని బీఎస్పీ తన నివేదికలో పేర్కొంది.