Politics

ఉక్కును తుక్కు చేయవద్దని మోడీకి జగన్ లేఖ

ఉక్కును తుక్కు చేయవద్దని మోడీకి జగన్ లేఖ

విశాఖ ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌ శనివారం లేఖ రాశారు. దానికి బదులు సొంత గనులు కేటాయించడం, రుణభారం తగ్గించడం లాంటి సహాయక చర్యలు ప్రకటిస్తే ఇది మళ్లీ లాభదాయక పరిశ్రమగా మారుతుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని ఆయన అన్నారు. ఆ పరిశ్రమ ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. పలువురు ఆంధ్రుల త్యాగాలు, 32 మంది ఆత్మార్పణతో విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని సీఎం గుర్తుచేశారు. 2002 నుంచి 2015 వరకు కర్మాగారం లాభాల బాటలో నడిచిందని చెప్పారు. కర్మాగారానికి ఉన్న 19,700 ఎకరాల భూముల విలువే ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. దీన్ని ఇటీవలే నవీకరించి, ఉత్పాదక సామర్థ్యాన్నీ పెంచారని సీఎం గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల 2014-15 నుంచి విశాఖ ఉక్కు మళ్లీ నష్టాల్లో పడిందన్నారు. సొంత గనులు లేకపోవడం ఉత్పాదక వ్యయం పెరగడానికి ప్రధాన కారణమని చెప్పారు.