Business

నెటిజన్లకు టాటా విజ్ఞప్తి-వాణిజ్యం

నెటిజన్లకు టాటా విజ్ఞప్తి-వాణిజ్యం

* ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై స్పందించిన టాటా.. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానని అన్నారు.

* ఎన్ఆర్ఐలు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, వారు సాధారణంగా విదేశీ పదవీ విరమణ ఖాతాలలో సంపాదించిన కార్పస్‌కు సంబంధించిన ప‌న్ను సమస్యలను ఎదుర్కొంటారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. విదేశీ పదవీ విరమణ ఖాతాల్లో వచ్చే డబ్బుపై ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) డబుల్ ట్యాక్సేష‌న్ నుంచి ఉపశమనం కల్పించాలని బడ్జెట్ 2021 ప్రతిపాదించింది.

* ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటికే బ్రాంచులు, ఏటీఎంల విలీనం పూర్తవ్వగా.. పాత చెక్కుల చెల్లుబాటు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ల విషయంలో మార్పులు జరగనున్నాయి. ఒకవేళ ఈ బ్యాంకుల్లో మీకు ఖాతాలు ఉన్నట్లయితే ఏయే మార్పులు చేసుకోవాలి? ఏ గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలో తెలుసుకోండి.

* శుక్రవారం నిఫ్టీ లాభం 29 పాయింట్లే.. అయినప్పటికీ మదుపర్లు పండగ చేసుకున్నారు. ఎందుకంటే చరిత్రలో తొలిసారి ఈ సూచీ 15000 పాయింట్లను ముద్దాడింది..2 వారాల కింద 50000 పాయింట్ల సంబరాన్ని జరుపుకున్న సెన్సెక్స్‌ శుక్రవారం 51000 పాయింట్ల శిఖరాన్ని తాకింది. అయితే ఈ స్థాయులు నిలబడలేదు. లాభాల స్వీకరణతో కాస్త వెనక్కి వచ్చాయి.
బడ్జెట్‌, ఆర్‌బీఐ పాలసీ జోష్‌తో మళ్లీ రేపో.. మాపో కొత్త గరిష్ఠాలపై సూచీలు స్థిరపడటం లాంఛనమే.

* ఆరోగ్యంపై వినియోగదారుల్లో జాగ్రత్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ అధునాతన ఇయర్‌బడ్స్‌ టోన్‌ ఫ్రీ ట్రూలీ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ హెచ్‌బీఎస్‌-ఎఫ్‌ఎన్‌7, హెచ్‌బీఎస్‌-ఎఫ్‌ఎన్‌6ల శ్రేణిని విపణిలోకి విడుదల చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్‌జీ ప్రాంతీయ వ్యాపారాధిపతి శశికిరణ్‌ రావు వీటిని ఆవిష్కరించి, మాట్లాడుతూ యూవీ నానో సాంకేతికతతో వీటిని తీసుకొచ్చినట్లు, ఛార్జింగ్‌ పెట్టినపుడల్లా 10 నిమిషాల్లో బ్యాక్టీరియాను 99.9 శాతం వరకు నివారిస్తుందని తెలిపారు. ఇయర్‌బడ్స్‌ను వినియోగిస్తున్నప్పుడు, కావాలనుకుంటే బయటి శబ్దాలూ వినొచ్చన్నారు. ప్రఖ్యాత బ్రిటిష్‌ ఆడియో సాంకేతిక కంపెనీ మెరిడియన్‌ ఆడియో నుంచి పొందిన సాంకేతికత ఇందులో వినియోగించినట్లు తెలిపారు. హెచ్‌బీఎస్‌ – ఎఫ్‌ఎన్‌7 బ్యాటరీ ఛార్జింగ్‌ 21 గంటలు ఉంటుందని, 7 గంటల ప్లేబ్యాక్‌ లభిస్తుందన్నారు. హెచ్‌బీఎస్‌ – ఎఫ్‌ఎన్‌6 లో 6 గంటల ప్లేబ్యాక్‌తో 18 గంటలు బ్యాటరీ పనిచేస్తుందని వివరించారు. తమ షోరూమ్‌లలో ఇతర పరికరాలు కొనుగోలు చేసిన వారికి ఇయర్‌ బడ్స్‌పై 60 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.