* తానాలో ఎన్నికల రణరంగం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
* తానా అధిష్టాన వర్గం పేరుతో చలామణీ అవుతున్న కొందరు పెద్దలకు ఈసారి చెక్ పెట్టాలని ప్రస్తుత తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి చేతులు కలిపి ముందుకు సాగడం ఈ ఎన్నికల్లో మరో విశేషం.
* శృంగవరపు నిరంజన్ వర్గం అభ్యర్థుల ఎంపికలో కొంత ముందంజలో ఉంది. ఆయన వర్గంలో కార్యదర్శిగా వేమూరి సతీష్, కోశాధికారిగా కొల్లా అశోక్ పోటీ చేస్తారని ప్రకటించారు.
* నరేన్ కొడాలి వర్గంలో కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ చేసే వారి విషయంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కార్యదర్శిగా భక్తా బల్లా, కోశాధికారిగా పంత్ర సునీల్ పోటీ చేస్తారని సమాచారం.
* తమ వర్గంలో ఉత్సాహం నింపడం కోసం తానా బోర్డు పదవులకు వేమన సతీష్, పొట్లూరి రవి, దేవినేని లక్ష్మీలు పోటీ చేస్తారని తెలిసింది.
* డెట్రాయిట్‌కు చెందిన తానా సీనియర్ నేత టాస్ వేద్దామని చేసిన ప్రతిపాదనను శృంగవరపు వర్గం తిరస్కరించినట్లు సమాచారం.
* ఈసారి జరుగుతున్న తానా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని అట్లాంటాకు చెందిన తానా సీనియర్ నేతలతో పాటు అధిష్టానం పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
* తానా అధ్యక్షుడి తర్వాత ప్రతిష్ఠాత్మకంగా భావించే తానా ఫౌండేషన్ అధ్యక్ష పదవిని పలువురు ఆశిస్తున్నారు. ప్రస్తుతం తానా కోశాధికారిగా ఉన్న వల్లేపల్లి శశికాంత్ అభ్యర్థిత్వాన్ని ఇరు వర్గాల వారు ఆమోదించవచ్చునని సమాచారం.
* ఫౌండేషన్‌లో ప్రవేశం కోసం పలువురు అభ్యర్థులు ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.
* తానా ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల అధికారిగా వివాదరహితుడిగా హ్యూస్టన్‌కు చెందిన ఐనంపూడి కనకంబాబు నియమితులయ్యారు. సహాయ ఎన్నికల అధికారులుగా డా.కోనేరు ఆంజనేయులు, ముత్యాల రాజాలు నియమితులయ్యారు. వీరంతా హ్యూస్టన్‌కు చెందినవారే.
* 2019 తానా వాషింగ్టన్ డీసీ మహాసభ సందర్భంగా పెట్టిన ఖర్చు విషయంలో కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. దీనిపై తానా బోర్డులో సవివరంగా చర్చించాలని ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం. జరగబోయే ఎన్నికల్లో ఈ ఖర్చులను వేలెత్తి చూపించి లబ్ధి పొందాలని శృంగవరపు వర్గం ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిసింది.
* ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఉభయ వర్గాల వారు ఇప్పటివరకు సన్నిహితంగా మెలిగినవారే. కానీ వర్గాలుగా విడిపోయి హోరాహోరీ పోరుకు సిద్ధమవుతుండటంతో ఇరువురికీ సన్నిహితులైన చాలా మంది తానా సభ్యులు ఎవరికి మద్దతు ఇవ్వాలో తర్జనభర్జన పడుతున్నారు. మొత్తమ్మీద ఎన్నికలు అంటూ జరిగితే అది కురుక్షేత్రాన్ని తలపిస్తుందని, ఎన్నికలు జరగకుండా రాజీ మార్గంలో వెళ్తేనే తానా పరువు-ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయని ఆ సంస్థ సభ్యులతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు కూడా అభిప్రాయపడుతున్నారు.
—
కిలారు ముద్దుకృష్ణ,
సీనియర్ జర్నలిస్ట్