Business

HCL ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్-వాణిజ్యం

Business News - HCL Employees To Get One Month Bonus

* దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగులకు సంస్థ శుభవార్త తెలియజేసింది. 2020లో కంపెనీ ఆదాయం 10 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ ప్రత్యేక బోనస్‌ ప్రకటించింది. కంపెనీలో కనీసం ఒక ఏడాది అనుభవం ఉన్న ఉద్యోగులకు పది రోజుల జీతాన్ని ఫిబ్రవరి నెల వేతనంతో అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇలా కంపెనీ బోనస్‌ రూపంలో చెల్లిస్తున్న మొత్తం విలువ రూ.700 కోట్లు కావడం విశేషం. 2020, డిసెంబరు 31 నాటికి కంపెనీలో 1,59,682 మంది ఉద్యోగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన 20 ఏళ్లలోనే ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం.. ఉద్యోగుల కృషికి నిదర్శనమని సంస్థ అభిప్రాయపడింది. మహమ్మారి సంక్షోభంలోనూ ప్రతిఒక్కరూ ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడింది.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆటోమేటెడ్ డిపాజిట్ క‌మ్ విత్‌డ్రాయ‌ల్‌ మెషిన్‌ (ఎడిడబ్ల్యుఎం) నగదును ఉపసంహరించుకోవటానికి మాత్రమే కాదు, కీలకమైన బ్యాంకింగ్ సౌకర్యాలను కూడా పొందవచ్చు. మీకు సమీపంలో ఉన్న ఎడిడబ్ల్యుఎం‌ లో కీల‌క‌ బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలిగినప్పుడు ఎందుకు క్యూలో నిలబడాలి? దానిపై అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి మరింత తెలుసుకోండి. ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్‌డ్రావల్ మెషిన్ (ఎడిడబ్ల్యుఎం) , క్యాష్ డిపాజిట్ మెషిన్ ఎటిఎమ్ లాంటి యంత్రం, ఇది ఎటిఎమ్ కమ్ డెబిట్ కార్డు ఉపయోగించి నేరుగా ఖాతాలో నగదును జమ చేయవ‌చ్చు. ప్ర‌తీసారి బ్యాంకుకు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా మీ ఖాతాలో తక్షణమే న‌గ‌దును డిపాజిట్ చేయడానికి మీరు ఈ యంత్రాన్ని ఉపయోగించవచ్చు. లావాదేవీల వివ‌రాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు.

* దేశీయ మార్కెట్లలో రికార్డుల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో వారం సూచీల లాభాల పరుగు మొదలైంది. ఆర్థికవృద్ధి రికవరీపై ఆర్‌బీఐ చేసిన సానుకూల వ్యాఖ్యలతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను మార్కెట్లు భారీ లాభాలతో మొదలుపెట్టాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకాయి. కొనుగోళ్ల అండతో 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ 51వేల మైలురాయిని దాటింది. నిఫ్టీ కూడా 15 వేల మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 541 పాయింట్లు ఎగబాకి 51,273 వద్ద, నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 15,081 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ 2శాతానికి పైగా లాభంలో ఉంది. ఆటో, బ్యాంకింగ్‌ షేర్లు రాణిస్తున్నాయి. బడ్జెట్‌ జోరుతో గతవారమంతా సూచీలు లాభాలను దక్కించుకున్న విషయం తెలిసిందే.

* వరుసగా రెండో నెలలో కూడా పేమెంట్‌ యాప్‌ ఫోన్‌పే టాప్‌లో నిలిచింది. ఫ్లిప్‌కార్ట్‌ మద్దతున్న ఫోన్‌పే మళ్లీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపీఐ) చార్టులో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఈ పేమెంట్ యాప్‌‌ గూగుల్‌‌ పేని అధిగమించి, టాప్ యూపీఐ యాప్‌‌గా ఫోన్‌‌పే నిలిచింది. జనవరిలో మొత్తం యుపీఐ లావాదేవీల్లో 41శాతం వాటాతో 968.72 మిలియన్ల లావాదేవీల వాల్యూమ్‌తో ఉన్న ఫోన్‌పే వరుసగా రెండవ నెలలో పరంపరను కొన సాగించింది.