Fashion

15ఏళ్ల తర్వాత మొదటి భర్త తిరిగొచ్చాడు

15ఏళ్ల తర్వాత మొదటి భర్త తిరిగొచ్చాడు

నాకు పెళ్లై ఇరవై ఏళ్లు అవుతోంది. ఐదేళ్లు కాపురం చేసి ఓ బాబు పుట్టాక వదిలేసి వెళ్లిపోయాడు. ఇంకో ఐదేళ్లు అత్తింట్లోనే ఉండి అతని కోసం ఎదురుచూశాను. తర్వాత పుట్టింట్లో ఉండి చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించుకున్నా. ఆపై ఇంట్లోవాళ్లు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేశారు. మాకు ఓ పాప పుట్టింది. ఏడాది క్రితం ఆయన ఓ ప్రమాదంలో చనిపోయారు. ఈ మధ్య నా మొదటి భర్త తిరిగి వచ్చి రెండో పెళ్లి చెల్లదని తనతో కాపురం చేయమని వేధిస్తున్నాడు. అప్పుడు చట్టప్రకారం మేం విడాకులు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవడం కరెక్టేనా? అతడి బారి నుంచి నేనూ నా పిల్లలు తప్పించుకునేదెలా!- ఓ సోదరి

మీరు ఇప్పటికయినా విడాకుల కోసం ప్రయత్నించండి. ఇప్పుడు మీ మొదటి భర్త మీ ఉద్యోగం, స్థితిగతులు చూసి వస్తానని అంటూ ఉండి ఉండొచ్చు. రెండో పెళ్లి చెల్లకపోయినా అతనితో కాపురం చేసినట్లు, పాప పుట్టినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి పాప మీ వారసురాలే. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 (8)ప్రకారం భార్యాభర్తలుగా మీ ఇద్దరూ రెండేళ్లు కలవకుండా విడివిడిగా ఉన్నారు. దాన్నే విడాకులకు కారణంగా చూపించవచ్చు సెక్షన్‌ 13(7) ప్రకారం ఏడేళ్లు కనిపించకుండా పోతే ఆ కారణం చూపించి కూడా మీరు డైవోర్స్‌ తీసుకోవచ్చు. ఇక, రెండో పెళ్లి చెల్లదనే కారణంతో మీ భర్తతో కాపురం చేయాలనే నియమం ఏమీ లేదు. మీకు ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడానికి అతడికి హక్కు లేదు. మీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడని పోలీసు ఫిర్యాదు ఇవ్వండి. లేదా ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, మానవహక్కుల కమిషన్‌, మహిళాకమిషన్‌లకు ఫిర్యాదు చేయండి. జరిగిన విషయాలన్నీ సాక్ష్యాలతో సహా ధృవ పరుస్తూ రాతపూర్వకంగా కంప్లయింట్‌ ఇస్తే… వారు అతడిని పిలిచి కౌన్సెలింగ్‌ చేయొచ్చు లేదా రిస్ట్రెయినింగ్‌ ఆర్డర్‌ కూడా ఇవ్వొచ్చు. అలానే కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసి మీ స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని కోరుతూ పిటిషన్‌ వేయొచ్చు. సాధారణంగా విడాకుల కేసుల్లో ఇంజంక్షన్‌ ఆర్డరు ఇవ్వరు. కానీ మీరు ప్రాణభయం ఉందని పోలీసులకు సాక్ష్యం చూపిస్తే ఇచ్చే అవకాశం ఉంది. త్వరగా నిర్ణయం తీసుకోండి.