ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌కు సమీపంలో ఔషధనగరిని నిర్మిస్తున్నామని ఇప్పటికే పలు దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీవశాస్త్రాల రంగంలో ముందున్న లిథుయేనియా సైతం ఔషధ నగరి అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరారు. ఆ దేశ రాయబారి జూలియస్ ప్రానెవిసియస్, ఇతర ప్రతినిధుల బృందం మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయింది. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలియస్ మాట్లాడుతూ, జీవశాస్త్రాల రంగంలో తమ దేశం ముందుందని, తమ జీడీపీలో 5 శాతం ఈ రంగానిదేనని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు తమ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వెల్లడించారు. అత్యున్నత మౌలిక సదుపాయాలతో 19 వేల ఎకరాల్లో ఔషధనగరిని నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. తెలంగాణ ఇప్పటికే భారతదేశానికి టీకాల రాజధానిగా ఉందని, ప్రపంచంలోని 33 శాతం టీకాలు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. కరోనా టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిందన్నారు. ఔషధనగరి నమూనాను మంత్రి వారికి అందజేశారు.
లిథువానియాకు కేటీఆర్ స్వాగతం
Related tags :