Food

గానుగ నూనె ఆరోగ్యానికి కానుక

గానుగ నూనె ఆరోగ్యానికి కానుక

*ప్రజల్లో చైతన్యంతో పెరుగుతున్న విక్రయాలు
***ఆధునిక సమాజంలో ప్రజలు ఉరుకులు, పరుగుల జీవితాన్ని సాగిస్తున్నారు. తీరికలేని పనులతో తింటున్న ఆహారంపైనా శ్రద్ధ లేకుండా పోతోంది. కరోనాతో ప్రజల్లో చైతన్యం ప్రారంభమైంది. పౌష్టికాహారం, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తున్నారు. ఏ వంటకం తయారు చేయాలన్నా నూనె తప్పనిసరి. మార్కెట్లో లభిస్తున్న రిఫైన్డ్‌ నూనెలపై రకరకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు గానుగ నూనెల వైపు మళ్లుతున్నారు. ఆధునిక జీవనశైలికి పాత పద్ధతులు జోడిస్తున్నారు.
**కొవిడ్‌ తెచ్చిన మార్ఫు..
పల్లీలు(వేరు శనగలు), కొబ్బరి, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెలను మనం బహిరంగ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నాం. వీటిని గతంలో ప్రధాన గ్రామాలు, పట్టణాల్లో గానుగ ఆడించి విక్రయించేవారు. ఆధునిక మిల్లులు, బహుళజాతి సంస్థలు వచ్చిన తర్వాత ఎక్కడో ఒకటి అరా మినహా అన్నీ కనుమరుగయ్యాయి. కొవిడ్‌ తెచ్చిన మార్పులతో ఇప్పుడు తిరిగి గానుగ నూనెలకు క్రమంగా గిరాకీ పెరుగుతోంది. ఖమ్మం నగరంతోపాటు, జిల్లాలోని వివిధ పట్టణాలు, శివారు ప్రాంతాల్లో గానుగలను ఏర్పాటు చేసి వివిధ రకాల నూనెల విక్రయిస్తున్నారు.
**అక్కడికక్కడే తయారీ..
ఖమ్మం నగరంలోనే 12 గానుగ ఆడించే కేంద్రాలు ఉన్నాయి. వీటిలో విద్యుత్తు యంత్రాలను ఉపయోగించి కట్టె గానుగలో పల్లీలు, కొబ్బరి, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలను నూనె పడుతున్నారు. ఈ కేంద్రాల నిర్వాహకులు తయారు చేసిన నూనెలు కొనుగోలు చేసేవారు కొందరైతే, తమకు అవసరమైన గింజలు అందించి నూనెలు అప్పటికప్పుడు పట్టించుకునేవారు కొందరున్నారు. రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతుండటంతో కొత్తగా యంత్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని కేంద్రాల్లో రోజుకు వేరుశనగ నూనె సుమారుగా 50లీటర్లు, నువ్వుల నూనె 5-6 లీటర్లు, కొబ్బరి నూనె 2-3 లీటర్లు విక్రయిస్తున్నారు. ఒకరిద్దరు వీటిని ఫిల్టర్‌ చేసి కూడా అందిస్తున్నారు.
**శరీరంలో ఇంకిపోతుంది..
చింతకాని మండలం సీతంపేటలో ఏడున్నర ఎకరాల భూమి తీసుకుని ఆవులు, ఎద్దులతో చెక్క గానుగలపై నూనె పడుతున్నారు. విదేశాల్లో 25 ఏళ్లు గడిపి వచ్చిన వాసిరెడ్డి అనిల్‌కుమార్‌ సంతృప్తికర జీవితం గడిపేందుకు ఇక్కడికి వచ్చి సేవా భావంతో సీతంపేటలో మూడు గానుగలను ఏర్పాటు చేశారు. నెమ్మదిగా గానుగ ఆడటం వల్ల నూనె వేడెక్కదని, ఈ నూనె శరీరంపై రాస్తే పది నిమిషాల్లో ఇంకిపోతుందని చెబుతున్నారు. అందుకే ఎలాంటి ప్రచారం లేకున్నా నగరంలో రోజుకు 50 లీటర్లకుపైగా వేరుశనగ నూనె విక్రయించగలుగుతున్నామన్నారు.
**సేంద్రియ నూనెలు తయారు చేస్తున్నాం -వాసిరెడ్డి అనిల్‌కుమార్
ఆరోగ్యానికి వంట నూనెలే ప్రధానం. ప్రజల్లో స్వచ్ఛమైన నూనె కావాలనే అభిప్రాయం పెరిగింది. లాభాపేక్ష లేకుండా సేవా భావంతో గానుగలు ఏర్పాటు చేశాం. ఎలాంటి కెమికల్స్‌ లేకుండా, నెమ్మదిగా తిరిగే గానుగపై ఉష్ణం తగలని సేంద్రియ నూనెలు అందిస్తున్నాం. ఒకరికొకరు ప్రచారం చేసుకుని వచ్చి తీసుకెళ్తున్నారు.