ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలకు కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. దిగ్గజ పర్వతారోహకుడు కెప్టెన్ ఎం.ఎస్.కోహ్లి ఒక ఆసక్తికరమైన వాదనను తెరపైకి తెచ్చారు. 1965లో ఆ హిమానీనదంపై ఉంచిన ఒక రేడియోధార్మిక పరికరం ఇందుకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. 1964లో చైనా.. షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఒక అణు బాంబును పరీక్షించింది. ఇది అప్పట్లో పశ్చిమ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే.. చైనాకు ఈ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేదని ఆ దేశాలు భావించాయి. దీంతో చైనా మరిన్ని అణు పరీక్షలు నిర్వహిస్తే పసిగట్టడానికి వీలుగా 1965లో అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్)తో కూడిన బృందం నందా దేవి హిమానీనదంపై ఒక రేడియో ధార్మిక పరికరాన్ని ఉంచింది. ఈ పరికరానికి ప్లుటోనియం క్యాప్సూళ్ల నుంచి శక్తి అందుతుంది. అవి దాదాపు వందేళ్లపాటు శక్తిని వెలువరిస్తాయి. ఆ తర్వాత దాని ఆచూకీ గల్లంతైంది. నాడు ఈ పరికరాన్ని ఉంచిన బృందంలో ఎం.ఎస్.కోహ్లి కూడా ఉన్నారు. తాజా ఘటనకు ఈ పరికరం కారణమై ఉండొచ్చని ఆయన చెప్పారు. ‘‘దాన్ని మనం కొట్టిపారేయలేం. అది దిగువ భాగానికి చేరి ఉంటుంది. దాన్ని వెతికేందుకు సీనియర్ శాస్త్రవేత్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. గాలింపు కోసం ఆధునిక మెటల్ డిటెక్టర్లను ఉపయోగించాలి’’ అని తెలిపారు. 25 అడుగుల ఎత్తులో ఉన్న నందా దేవి శిఖరాగ్రానికి ఆ పరికరాన్ని తీసుకెళుతుండగా మార్గమధ్యంలో వాతావరణం ప్రమాదకరంగా మారిపోయిందని కోహ్లీ చెప్పారు. ‘‘గాలులు ఉద్ధృతమయ్యాయి. మేం ముందడుగు వేయలేకపోయాం. ఆ పరికరాన్ని కిందకు ఈడ్చుకొచ్చే పరిస్థితి కూడా లేదు. దాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నాం. మంచులో ఒక గుంత తవ్వి, అందులో ఈ సాధనాన్ని ఉంచాం. తర్వాత మళ్లీ అక్కడి వచ్చి.. దాన్ని నందాదేవి శిఖరంపైకి చేర్చాలనుకున్నాం. 1966లో తిరిగి ఆ ప్రదేశానికి వెళ్లాం. అయితే ఆ పరికరంలోని అణుశక్తి జనరేటర్ సాధనం గల్లంతైంది. యాంటెన్నా, ఇతర భాగాలు మాత్రమే ఉన్నాయి. ఇది తీవ్ర కలవరం సృష్టించింది. ఎందుకంటే ఆ జనరేటర్‌లో ఏడు అణుశక్తి క్యాప్సూళ్లు ఉన్నాయి. హిరోషిమాపై వేసిన అణు బాంబు సామర్థ్యంలోని సగం శక్తితో ఇవి సమానం. జనరేటర్‌ను కనుగొనేందుకు మూడేళ్లు శ్రమించినా.. ఫలితం లేదు. చాలా వేడిగా ఉన్న ఆ జనరేటర్ హిమానీనద మంచును కరిగించుకుంటూ కిందకు జారిపోయి ఉంటుంది. అక్కడికి చేరి ఉంటే అది రుషి గంగ నదికి ప్రధాన నీటిని అందించే భాగంలోకి జారి పోయి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 25వేల అడుగుల ఎత్తులో ఆ పరికరాన్ని పెట్టాలన్న సీఐఏ నిర్ణయం తప్పని కోహ్లీ చెప్పారు. 22వేల అడుగుల ఎత్తులోని నందా కాట్ డోమ్ వద్ద అమరిస్తే సరిపోతుందని తాను వాదించినట్లు తెలిపారు. ‘‘అయినా వారు వినలేదు. 1967లో లద్దాఖ్‌లోని ఖర్‌దుంగ్లా పాస్‌లోని 18,300 అడుగుల ఎత్తులో మరో పరికరాన్ని ఉంచాం. అది చైనా అణు సంకేతాలను అద్భుతంగా పసిగట్టింది’’ అని చెప్పారు.
ఉత్తరాఖండ్ ప్రమాదానికి CIA కారణమంటున్న భారత పర్వతారోహకుడు
Related tags :