కొంతమందికి చిన్నప్పటి నుంచే కంటి సమస్యలు మొదలవుతాయి.. రేచీకటి, అంధత్వం లాంటి సమస్యలు బాధపెడుతుంటాయి.. వీటికి కారణం విటమిన్ ఎ లోపం.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. పెద్దల నుంచి పిల్లల వరకు విటమిన్ల కొరత లేకుండా ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్- అతి ముఖ్యమైన, అమైన్ – అమినో సమ్మేళనాలని ఫంక్ అనే శాస్త్రవేత్త 1912లో ప్రతిపాదించాడు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పతి చేయలేవు. కానీ శక్తి ప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కొన్ని విటమిన్లు మాత్రం సహఎంజైములుగా పనిచేస్తాయి. మొత్తం మీద విటమిన్లు 13 రకాలు. వీటిని రెండు రకాలుగా వర్గీకరణలు జరిగాయి. విటమిన్ ఎ, డి, ఇ, కె.. విటమిన్లు కొవ్వుల్లో కరుగుతాయి. కొవ్వుల్లో కరిగే ఈ విటమిన్లు శోషరసం ద్వారా వివిధ భాగాలకు అందుతాయి. ఇక విటమిన్ బి, సి నీటిలో కరుగుతాయి. ఇవి పేగులో నేరుగా చేరి రక్తంలోకి శోషణం చెంది వివిధ భాగాలకు రవాణా అవుతాయి.
**చిన్నారులకు విటమిన్ ఎ..
ఆకుకూరల్లో విరివిగా లభించే విటమిన్ – ఎ కళ్లకు మంచిది. అదే విటమిన్ చిన్నారులకు మలేరియా రాకుండా నివారిస్తుందట. ఇది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట! ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని ఇస్తే.. ప్రభావం చాలా వరకు పనిచేస్తుందట. కొందరు చిన్నారులకు తరచూ.. జలుబు, జ్వరం వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అంటే.. వారికి తగినంత వ్యాధినిరోధక శక్తి లోపించిందని అర్థం. పుట్టిన పాపాయి నుంచి ఆరునెలల వరకు తల్లిపాల ద్వారా తగినంత విటమిన్ – ఎ లభిస్తుంది. ఆరునెలల తర్వాత ఆహారం ద్వారా విటమిన్ – ఎ పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు జింక్, ఐరన్తో పాటు.. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఎ విటమిన్ కూడా తగిన మోతాదులో అందేలా చూడాలి. కంటిచూపు, ఎముకల బలాన్ని పెంచడమేకాదు… మెదడు చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
**లోపం వల్ల..
మనదేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా బిటాట్ స్పాట్ (తెల్లని గుడ్డుపై నల్లటి మచ్చ)తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది. సాధారణంగా విటమిన్ ఎ లోపం వల్ల కంటి చూపు తగ్గడమే కాదు.. చర్మంలో కల తగ్గడం, విపరీతంగా మొటిమలు, క్యాన్సర్ ప్రమాదం పెంచే ప్రీరాడికల్స్ ఇవన్నీ విటమిన్ ఎ తగ్గడం వల్లే వస్తాయి. విటమిన్ ఎ తగ్గితే పలు రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అంతేకాదు.. మోనోపాజ్ దాటాక మహిళల్లో వచ్చే గుండె జబ్బు, నాడీ సంబంధ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని తగ్గించాలంటే విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు, డయేరియా, ఆకలి మందగించడం లాంటి సమస్యలు కూడా ఈ లోపం వల్లే వస్తాయి. ఇక గర్భవతులు కాన్పు సమయంలో వ్యాధులు రావడానికి కారణం విటమిన్ ఎ లోపమే! కొన్నిసార్లు గర్భవతులు విటమిన్ ఎ లోపం కారణంగా కాన్పు సమయంలో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రేచీకటి, జిరాఫ్తాల్మియా, కెరటోమలేసియా, బైటాట్స్ స్పాట్స్, ప్రినోడెర్మాలు కూడా విటమిన్ ఎ లోపం వల్ల కలుగుతాయి.
**విటమిన్ ఎ లభించే ఆహారపదార్థాలు..
ఆహారం100 గ్రా.ల్లో లభించే బీటా కెరోటిన్ (మి.గ్రా.)
కొత్తిమీర 4.8
కరివేపాకు 7.11
మునగాకు 19.69
మెంతికూర 9.1
క్యారెట్ 6.46
మామిడిపండు 1.99
పొప్పడి 0.88
గుమ్మడికాయ 1.16
చికెన్ లివర్ 9.66
కోడిగుడ్డు 1.34
బచ్చలికూర 2.83
వెన్న 0.99
చేపలు 3.33
**బీటా కెరోటిన్ రూపంలో..
విటమిన్ ఎ రసాయన నామం రెటినాల్. ఇది మొక్కల్లో బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. కాలేయం, పేగుల్లో విటమిన్ ఎగా మారుతుంది. కంటిచూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్ ఎ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ ధృడత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఆకుకూరలు, పసుపు రంగు, నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారుతుందన్నమాట. ముఖ్యంగా మాంసాహారంలో ఇది సమృద్ధిగా లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా క్యారెట్లో ఇది బాగా దొరుకుతుంది. అంతేకాకుండా.. పాలు, పాలతో చేసే పదార్థాలు, గుడ్డు, ఆకుకూరలు, ఎర్రపామాయిల్, చేపలు, చేప నూనెల్లో కూడా విటమిన్ ఎ ఉంటుంది. ఇది చర్మం మీద బాగా పనిచేస్తుంది. చర్మం ముడతలు పడకుండా, వెంట్రుకల్ని సంరక్షిస్తుంది.
విటమిన్ A తీసుకుంటే కంటిచూపు బాగుంటుంది
Related tags :