* దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. బుధవారం పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.60కి చేరింది. డీజిల్ ధర రూ. 77.73గా ఉంది. హైదరాబాద్‌లోనూ చమురు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నగరంలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు పెరిగి రూ. 91.09కి చేరింది. డీజిల్ ధర రూ. 84.79 గా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ. 94.12కు చేరింది. కోల్‌కతాలో రూ. 88.92, చెన్నైలో రూ. 89.96గా ఉంది. డీజిల్ ధర ముంబయిలో రూ. 84.63, కోల్‌కతాలో రూ. 81.31, చెన్నైలో రూ. 82.90గా ఉంది.
* పెట్రోల్, డీజిల్‌లపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన ప్రస్తుతం లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ఇంధన ధరలపై ఉన్న పన్నులను కేంద్రం తగ్గిస్తుందా అన్న ప్రశ్నలను తోసిపుచ్చింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని పేర్కొంది.
* లాక్‌డౌన్ తదనంతర పరిస్థితుల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెజారిటీ సంస్థలు ఇంటి నుండి పని చేసే హైబ్రిడ్ వర్క్ కల్చర్ మొదలెట్టాయి. ఈ పరిస్థితికి అలవాటు పడ్డ ఉద్యోగులు ఇంటి విషయంలో ఆధునీకరణకు, ఇంటి విస్తరణకు పూనుకుంటున్నారు. ప్రత్యేక హోమ్ ఆఫీస్ గది కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఇంటిలో ప్రత్యేకమైన స్థలం పని ఉత్సాహాన్ని పెంచడమే గాక ఉత్పాదకతను పెంచుతుందని నమ్ముతున్నారు.
* ప్రస్తుతం, డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్, ఓటరు ఐడి, పాన్ కార్డ్, పాఠశాల, కాలేజ్ సర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన అనేక ఇతర పత్రాలను డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. త్వరలో, మీరు మీ బీమా పాలసీలను డిజిలాకర్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచగలుగుతారు. బీమా రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఆలోచనతో, పాలసీదారులకు బీమా ప్రక్రియ సులభతరం చేయాలనే లక్ష్యంతో, బీమా కంపెనీలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ బీమా పాలసీలను జారీ చేయనున్నట్లు బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రకటించింది.
* దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇటీవల జీవనకాల గరిష్ఠాలకు చేరిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అదే సమయంలో ఆటో, రియల్టీ వంటి షేర్లు రాణించడంతో వరుసగా రెండో రోజూ స్వల్ప నష్టాలతో సూచీలు బయటపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.84గా ఉంది.