ScienceAndTech

ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారు?

ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారు?

ప్రశ్న: ఆక్సిజన్ను ఎందుకు -ఎలా తయారు చేస్తారు?

జవాబు: మన వాతావరణంలోని గాలిలో 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌, ఒక శాతం ఇతర వాయువులు ఉంటాయి. ఆక్సిజన్‌ ఉనికిని తొలిసారిగా లెవోషియర్‌, ప్రీస్ట్‌లీ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రంగు, రుచి, వాసన లేని ఈ వాయువు భూమి పొరల్లో లోహపు ఆక్సైడ్‌ రూపంలో 50 శాతం వరకూ ఉంటుంది. ఆక్సిజన్‌ వాయువు మైనస్‌ 185 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద లేత నీలం రంగు ద్రవంగా మారుతుంది. మైనస్‌ 219 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఘనపదార్థంగా మారుతుంది.

ప్రయోగశాలలో పొటాషియం క్లోరేట్‌, మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా ఆక్సిజన్‌ వాయువును తయారు చేస్తారు. వాతావరణంలోని గాలి నుంచి ఆంశిక స్వేదన క్రియ (Fractional Destillation) ద్వారా వేరు చేయవచ్చు. గాలిని మామూలు వాతావరణ పీడనం కన్నా 200 రెట్లు ఒత్తిడికి గురి చేసి, అతి సన్నని రంధ్రం గుండా ఒక గదిలోకి పంపిస్తారు. పీడనం హఠాత్తుగా పడిపోవడంతో ఆ గాలి ద్రవంగా మారుతుంది. ఈ ద్రవం నుంచి నైట్రోజన్‌ వాయువును వేరు చేయడం ద్వారా ఆక్సిజన్‌ లభిస్తుంది. దీన్ని వాయురూపంలోకి మార్చి సిలెండర్లలో నింపుతారు.

ఆక్సిజన్‌ను ఎసిటెలిన్‌ వాయువుతో మండిస్తే అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన మంట వస్తుంది. ఆ మంటను లోహాలను వెల్డింగ్‌ చేయడానికి, కోయడానికి ఉపయోగిస్తారు. ఆసుపత్రుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైన రోగులకు ఆక్సిజన్‌ను అందిస్తారు. పర్వతారోహకులు, సముద్రం లోతుల్లోకి వెళ్లే డైవర్లు, అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్‌ సిలెండర్లను ఇస్తారు. రాకెట్ల ఇంధనంగా కూడా ఆక్సిజన్‌ను వాడతారు.