రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీని విడగొట్టేందుకు శశికళ సమీప బంధువైన టీటీవీ దినకరన్ కుట్రలు చేస్తున్నారని తమిళనాడు సీఎం పళనిస్వామి ఆరోపించారు. ఆయన కుట్రల్ని తాము సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు పళనిస్వామి బుధవారం కృష్ణగిరిలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడారు. ‘శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే నాయకుడు టీటీవీ దినకరన్ గతంలో అన్నాడీఎంకే పార్టీని విడగొట్టేందుకు ప్రయత్నించారు. పార్టీలో 18 మందిని బయటకు లాగి తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకూ తీరని కుట్రలు చేశారు. కానీ పార్టీలోని ఐక్యత వల్ల అతడి కుట్రలు సాగలేదు. 2017లో నేను సీఎం పదవి చేపట్టిన తర్వాత ప్రజలకు మంచి పాలన అందించాను. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మళ్లీ అదే తరహా కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమ్మ(జయలలిత) ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచే తొలగించారు. గత పదేళ్లుగానూ అతడు పార్టీలో లేడు. అలాంటి వ్యక్తి ఈ రోజు అన్నాడీఎంకే పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాడు. ఇలాంటి చర్యలను అన్నాడీఎంకే పార్టీ ఎప్పటికీ అంగీకరించదు. పార్టీ కార్యకర్తల కృషి వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. ఇక్కడ కష్టపడి పనిచేసే కార్యకర్త మాత్రమే సీఎం అవుతాడు ’ అని అన్నారు. తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం సోమవారం ఆమె తమిళనాడులో అడుగుపెట్టగా.. ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు.
శశికళ…నీ ఆటలు ఇక్కడ సాగవు
Related tags :