Business

₹11కోట్లకు అమ్ముడుపోయిన 1976 యాపిల్ కంప్యూటర్-వాణిజ్యం

₹11కోట్లకు అమ్ముడుపోయిన 1976 యాపిల్ కంప్యూటర్-వాణిజ్యం

* యాపిల్‌ కంప్యూటర్‌ ధర రూ. అన్ని కోట్లు ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? మరి అది మాములు కంప్యూటర్‌ కాదు.. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌.. స్టీవ్‌ వొజ్నియాక్‌ 1976లో ఆవిష్కరించిన తొలి యాపిల్‌ 1 కంప్యూటర్‌ అది. అమెరికాకు చెందిన కృష్ణ బ్లాకే అనే వ్యక్తి ఈ యాపిల్‌ 1 కంప్యూటర్‌ను 1978లో కొనుగోలు చేశాడట. ప్రస్తుతం దీన్ని ఈ-బేలో అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికీ కంప్యూటర్‌ పని చేస్తుండటం విశేషం. చెక్కపెట్టెలో కీబోర్డుతో ఉండే ఈ కంప్యూటర్‌ ధర 15లక్షల డాలర్లు(రూ. 11కోట్లు)గా నిర్ణయించాడు. షిప్పింగ్‌ ఛార్జి 450 డాలర్లు(రూ.32వేలు) అదనం. విదేశాలకు పంపాల్సి వస్తే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. కొనుగోలు చేసే వారికి ఈ కంప్యూటర్‌తోపాటు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే మాన్యువల్‌ బుక్‌.. ఔట్‌పుట్‌ కోసం సోనీ టీవీ-115 మానిటర్‌ వస్తాయి. ఈ కంప్యూటర్‌లో బేసిక్‌ లాంగ్వేజ్‌, గేమ్స్‌, లో అండ్‌ హై మొమోరీ టెస్ట్‌, యాపిల్‌ 30వ వార్షికోత్సవం వీడియో ఉన్నాయట. ‘‘ఈ కంప్యూటర్‌ ఎంతో విలువైనది. పాడయ్యే లేదా దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కొత్త యజమాని చెంతకు చేరేవరకు ఈ కంప్యూటర్‌ను ఫ్లోరిడాలోని బ్యాంక్‌ లాకర్‌లో భద్రంగా దాచిపెట్టాను’’అని కృష్ణ వెల్లడించాడు.

* ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ ఆర్సెలర్‌ మిత్తల్‌ నూతన ఛైర్మన్‌, సీఈఓగా ఆదిత్య మిత్తల్‌ను ప్రకటించారు. తన తండ్రి, కంపెనీ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన లక్ష్మీ మిత్తల్‌ నుంచి ఆయన ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా, లక్ష్మీ మిత్తల్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. లక్సెంబర్గ్‌ ప్రధాన కేంద్రంగా గల ఈ దిగ్గజ సంస్థ అరవై దేశాల్లో స్టీలు, మైనింగ్‌ కార్యకలాపాలతో తన ఉనికిని చాటుకుంది.. పదిహేడు దేశాల్లో ఉక్కునిర్మాణ రంగంలో ఉంది. 2006లో ఆర్సెలర్‌ సంస్థతో మిత్తల్‌ స్టీల్‌ విలీనమై ప్రస్తుతమున్న ఆర్సెలర్‌ మిత్తల్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే.

* దేశంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. వరుసగా మూడో రోజులు ఇంధన ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. గురువారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 87.85కు చేరింది. డీజిల్‌ ధర రూ. 78.03గా ఉంది. హైదరాబాద్‌లోనూ ఇంధన ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే నగరంలో రూ. 91 దాటిన లీటర్‌ పెట్రోల్‌ ధర గురువారం రూ. 91.35కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 85.11గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.36 పలుకుతుండగా.. డీజిల్‌ ధర రూ. 84.94గా ఉంది.

* ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర గురువారం ప్రధాని మోదీని ప్రశంసించారు. బుధవారం లోక్‌సభలో మోదీ తన ప్రసంగంలో ప్రైవేటు సంస్థలను ప్రశంసించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. ఇందులో భాగంగా.. దేశ అభివృద్ధిలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ రంగంలో అందరికీ అవకాశాలుంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు రంగం కూడా ముఖ్యమని ప్రధాని చెప్పడంతో ఆ రంగానికి చెందిన పలు సంస్థలు మోదీని కొనియాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా ట్విటర్లో మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న ప్రైవేటు సంస్థలకు ప్రధాని ప్రోత్సాహకరమైన మాటలు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయి. దీనిని స్వాగతిస్తూ.. మనం అంచనాలను అందుకోవాలి.’’ అని ఆనంద్‌ మహీంద్రా ఆ పోస్టులో పేర్కొన్నారు.

* రెండు రోజుల ఒడుదొడుకుల తర్వాత దేశీయ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ షేర్లలో లాభాలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 15,150 మార్క్‌పైన స్థిరపడింది.

* ఈ కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు ఈ ఫిబ్ర‌వ‌రి 4 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల‌ వ‌రకూ ఎఫ్‌డీల‌ను అందిస్తుంది. వేర్వేరు కాల‌ప‌రిమితికి ఈ వ‌డ్డీ రేట్లు 2.50% నుండి 5.25% వ‌ర‌కు ఉన్నాయి.
Kotak Mahindra FD Interest Rates