Politics

భారీ కాన్వాయ్‌లో వెళ్లి గిరిజనులను కలవనున్న షర్మిల

YS Sharmila To Meet With Khammam District Tribes

వైఎస్‌ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.. తాజాగా గురువారం ఆమె ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆ జిల్లా నేతల విన్నపం మేరకు ఆమె ఖమ్మంలో పర్యటించనున్నారు. ఆ వివరాలను కొండా రాఘవరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘దివంగత నేత వైఎస్సార్‌కు ఖమ్మం జిల్లా బ్రహ్మరథం పట్టిందని అక్కడి నేతలు షర్మిలకు వివరించారు. ఈనెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్సార్‌ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు అక్కడి గిరిజనులకు 90 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల్ని కొందరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధిత గిరిజనులతో ఆమె 45 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమవుతారు. అంతేగాకుండా 500 మంది ముఖ్య నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు..’అని ఆయన వివరించారు. ఈ నెల 21న ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌ నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారని రాఘవరెడ్డి తెలిపారు. ‘హైదరాబాద్‌ నుంచి హయత్‌నగర్, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, పాలేరు మీదుగా ఆమె ఖమ్మంలోకి ప్రవేశిస్తారు. అందుకు సంబంధించి దారి పొడుగునా భారీగా స్వాగత ఏర్పాట్లు ఉంటాయి. ఖమ్మం చేరుకున్నాక మొదట ఆమె వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఏ జిల్లాకు వెళ్లినా 2004 నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌ పరిపాలన కాలంలో జరిగిన అభివృద్ధి, తర్వాత అనేక మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులపై షర్మిల సమీక్ష చేస్తారు. వైఎస్సార్‌ అంటేనే అభివృద్ధి, సంక్షేమం..’అని ఆయన పేర్కొన్నారు.