యుఎస్ ఓపెన్ ఛాంపియన్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) అతికష్టంపై ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్ దాటాడు. శుక్రవారం మూడున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన పోరులో థీమ్ 4-6, 4-6, 6-3, 6-4, 6-4తో నిక్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. టాప్ సీడ్ జకోవిచ్ కూడా అయిదు సెట్ల పోరులో కష్టపడి విజయం సాధించాడు. అతను 7-6 (7-1), 6-4, 3-6, 4-6, 6-2తో అమెరికా కుర్రాడు టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. ఈ పోరులో మూడు, నాలుగు సెట్లు చేజార్చుకుని ఒత్తిడిలో పడినా.. ఆఖరి సెట్లో తన శైలిలో దూకుడుగా ఆడిన జకో విజయాన్ని అందుకున్నాడు. అయితే ఈ మారథాన్ పోరు సందర్భంగా కండర గాయం అయినట్లు నొవాక్ వెల్లడించాడు. ‘‘ప్రస్తుతం కండరంలో చీలిక వచ్చింది. దీని నుంచి కోలుకుని మళ్లీ కోర్టులోకి అడుగుపెడతానో లేదో’’ అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు ఎనిమిదో సీడ్ స్క్వాట్జ్మ్యాన్ (అర్జెంటీనా), పదకొండో సీడ్ షపవ్‌లోవ్ (కెనడా) ఇంటిముఖం పట్టారు. 20వ సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా) 7-5, 7-5, 6-3తో షపవ్లోవ్ను ఓడించగా.. క్వాలిఫయర్ అస్లాన్ (రష్యా) 6-3, 6-3, 6-3తో స్క్వాట్జ్మ్యాన్కు షాకిచ్చాడు. ఆరోసీడ్ జ్వెరెవ్‌తో పాటు రోనిచ్ (కెనడా), దిమిత్రోవ్ (బల్గేరియా), లాజోవిచ్ (సెర్బియా), దిమిత్రోవ్ కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా తార సెరెనా విలియమ్స్ ప్రిక్వార్టర్స్ చేరింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఈ పదో సీడ్ 7-6 (7-5), 6-2తో 19 ఏళ్ల పొటపోవా (రష్యా)ను ఓడించింది. రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ముందంజ వేసింది. ఆమె 6-1, 6-3తో కుదెర్మెటోవా (రష్యా)పై పెద్దగా కష్టపడకుండానే గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఒసాకా (జపాన్)6-3, 6-2తో జబెర్ (ట్యూనీసియా)పై గెలవగా, సబలెంక (బల్గేరియా) 6-3, 6-1తో ఆన్లీ (అమెరికా)పై, వోండ్రుసోవా 6-2, 6-4తో సొరానా (రొమేనియా)పై, ముగురుజ (స్పెయిన్) 6-1, 6-1తో దియాస్ (కజకిస్థాన్)పై, స్వైటెక్ (పోలెండ్) 6-4, 6-3తో ఫెర్రో (ఫ్రాన్స్)పై నెగ్గారు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అభిమానుల రాకకు బ్రేక్ పడింది. క్రీడాకారులు ఉండే క్వారంటైన్ హోటల్లో కొవిడ్ పాజిటివ్ రావడంతో.. విక్టోరియా రాష్ట్రంలో అయిదు రోజుల లాక్డౌన్ విధించారు. శుక్రవారం ప్రేక్షకులను స్టేడియం నుంచి పంపించేశారు.
ఛాంపియన్‌కే చెమట పట్టించారు

Related tags :