ScienceAndTech

గుజ్జు నుండి కాగితం వరకు

How is paper made from pulp - Telugu tech news

తెల్లని కాగితం ఎలా వస్తుంది?ఏమిటా పద్ధతులు?మనకు తెలియని విధానాలు?ఓసారి చదివేద్దామా?పుస్తకాలు, పరీక్షలు, స్కూలు… ఇలా ఎక్కడైనా కాగితం అవసరమే. ఇది లేని మన చదువుని వూహించలేం. ఇది చెట్ల నుంచి వస్తుందని తెలుసు. అయితే చెక్క పేపర్‌గా మారడం వెనుక ఇంకా చాలా తతంగమే ఉంది. అదేంటో చూద్దాం.
* మ్యాపల్‌, ఓక్‌, పాప్లర్‌, యూకలిప్టస్‌, పైన్‌… లాంటి చెట్ల కలపను కాగితం తయారీలో వాడతారు.
* చెట్లను నరికి దుంగల్ని ఫ్యాక్టరీలకు తరలిస్తారు.
* పై బెరడును మిషన్ల ద్వారా తొలగిస్తారు.
* తర్వాత ఆ దుంగల్ని యంత్రాలు చిన్న చిన్న చెక్క ముక్కలుగా చేసేస్తాయి.
* ఆ ముక్కల్లో నీరు కలిపి బాయిలర్లలో ఉడికించి పేస్ట్‌లా చేస్తాయి.అలా గోధుమ రంగులో తయారైన పేస్ట్‌ని రసాయనాలు కలిపి తెల్లగా మారుస్తారు.* తెల్లగా మారిన ద్రవం నుంచి నీటిని బయటకి పంపించి పీచుమిఠాయిలా కనిపించే పదార్థాన్ని(పల్ప్‌) తయారుచేస్తారు. దాన్ని లెక్కకు కొలిచి ప్యాకింగ్‌ చేస్తారు. కాగితం తయారీలో ఇదే ముడి సరుకు.
* దీన్ని వేరే కర్మాగారంలో నీళ్లతో కలిపి ఉడికించి ద్రవరూపంలోకి మారుస్తారు.* ఆ ద్రవం యంత్రాల్లో కాలువలా ప్రవహిస్తుంటుంది.* దాన్ని వేడితో ఆవిరి చేస్తూ పైన గుండ్రటి బరువైన ఇనుప రాడ్లలాంటివాటితో చదును చేస్తూ పల్చటి కాగితాన్ని తయారు చేస్తారు.
* దాన్ని పెద్ద బండిళ్లుగా చుట్టి అమ్ముతారు.* మనం వాడుకునే టెక్స్ట్‌బుక్‌లు, నోట్‌బుక్‌లు తయారు చేసే ఫ్యాక్టరీల వాళ్లు, పత్రికల వాళ్లు ఈ బండిళ్లను కొనుక్కుంటారు. తర్వాతే కావల్సిన సైజుల్లో కత్తిరించి, ముద్రణలు చేసుకుంటారు. బైండింగులూ చేస్తారు.
**** ఔనా!
* ఒకటన్ను కాగితాన్ని రీసైకిల్‌ చేస్తే పదిహేడు చెట్లను కాపాడినట్లే.
* ఒక పైన్‌ చెట్టు నుంచి 80,500 కాగితపు షీట్లు తయారవుతాయి.
* భూమి మీద సాగుచేసే కలపలో 42శాతం కాగితం తయారీకే వాడతారు.
**** రీసైక్లింగ్‌
వాడేసిన కాగితాల్ని రీసైకిల్‌ చేసి మళ్లీ దాన్ని కాగితంగా మారుస్తారని మనకూ తెలుసు కదూ. ఆ కాగితాల్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. దానికి నీటిని కలిపి ఉడకబెడతారు. ముద్రణలు పోయేట్టు డీఇంక్‌ చేస్తారు. దానిలో రసాయనాలు కలిపి తెల్లటి ద్రవాన్ని తయారు చేస్తారు. దాన్ని కాగితంగా మారుస్తారు.