ప్రపంచంలోనే ప్రముఖ తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో “ఎన్నికల రణరంగం” తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రస్తుత తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, తానా బోర్డ్ మాజీ అధ్యక్షుడు కొడాలి నరేన్ వర్గాల మధ్య భీకర పోరుకు వేదిక సిద్ధమయ్యింది. తానా ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు గోగినేని శ్రీనివాస్ కూడా ఎన్నికల బరిలో దిగి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. నరేన్, నిరంజన్ ఇద్దరూ పూర్తి స్థాయిలో తమ తరపున అభ్యర్ధులను పోటాపోటీగా ఎన్నికల రణరంగంలోకి దింపారు.
*** కత్తులు నూరుతున్న వైరి వర్గాలు
తానా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలు జగగబోతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తమ తూటాలకు పదును పెడుతున్నారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపడానికి ఎవరికి వారు తమ ప్రత్యర్ధుల గత చరిత్రలను తవ్వి తీస్తున్నారు.
*** ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు ఎన్నో!
ఈసారి జరిగే తానా ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్నవారు శత్రువులుగా మారారు, కొందరు శత్రువులు మిత్రులుగా మారి పోరాడుకుంటున్నారు. ఇరు వర్గాలకు సన్నిహితులుగా ఉన్న చాలా మంది ఏ వర్గానికి మద్దతు ఇవ్వాలో తెలీక జుట్టులు పీక్కుంటున్నారు. మరికొందరు ఉభయ వర్గాల వైపు ఉంటున్నట్లు నటిస్తున్నారు. జోకర్లు, బ్రోకర్లు పాత్ర పోషించే కొందరు వ్యక్తులకు ఈ ఎన్నికలు పాడికుండగా మారాయి. ఉదయం ఒక వర్గంతోను, సాయంత్రం మరొక వర్గంతోనూ వీరు మంతనాలు జరుపుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారు.
*** నాటి శత్రువులు – నేటి మిత్రులు
గతంలో వేమన సతీష్, కోమటి జయరాం వర్గానికి దూరంగా ఉన్న భక్తా భల్లా ఈ పర్యాయం వారి వెంట నడుస్తున్నారు, వారి వర్గం తరపున కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. వేమన, జయరాం వర్గంతో మొన్నటి వరకు సన్నిహితంగా ఉన్న వేమూరి సతీష్ నేడు ప్రత్యర్ధి వర్గంతో చేతులు కలిపి శృంగవరపు ప్యానల్ నుండి కార్యదర్శి పదవికి రంగంలోకి దిగారు. అందరినీ అక్క, బావ, అంకుల్, అన్న అంటూ వరసలు కలిపి పిలిచే కొల్లా అశోక్ తన గురువులకు నామం పెట్టి నిరంజన్ ప్యానల్ లో కోశాధికారి పదవికి నామినేషన్ వేశారు.
*** ప్రేక్షక పాత్ర పోషించిన తానా పెద్దలు
తానాలో ఇప్పటి వరకు పెద్దలుగా చలామణీ అయిన కోమటి జయరాం , నాదెళ్ళ గంగాధర్, వేమన సతీష్ లు ఈ పర్యాయం జరుగుతున్న తానా ఎన్నికల్లో తమ పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కోడాలి నరేన్ వర్గానికి ఏకపక్షంగా కొమ్ము కాయడం తానాలో చాలా మంది సభ్యులకు నచ్చడం లేదు. ప్రస్తుత తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి కూడా ఈ ఎన్నికల్లో ఇరు వర్గాలకూ రాజీ కుదర్చలేకపోయారు. గత రెండు నెలల నుండి హైదరాబాద్ లో మకాం వేసి శృంగవరపు నిరంజన్ వర్గం తరపున చక్రం తిపుతున్నారు. సహజంగా తానా అధ్యక్ష భాధ్యతలు స్వీకరించే వారు వర్గాలకు అతీతంగా, వివాదాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. తానా సభ్యులందరినీ ఏకతాటి పైకి తీసుకురావలసిన బాధ్యత అధ్యక్ష పదవి చేపట్టే వ్యక్తిపై ఉంటుంది. దానిని విస్మరించిన లావు అంజయ్య చౌదరి ఈ పర్యాయం ఒక వర్గానికి పూర్తిగా కొమ్ము కాయడం పట్ల తానా సభ్యుల్లో ముఖ్యంగా తానా పెద్దల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కనీసం ఇప్పటి నుండైనా అంజయ్య చౌదరి వర్గాలకు అతీతంగా ఉండి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది.
*** ఎన్నికల వేడి మొదలయ్యిందిగా…!
నామినేషన్ల గడువు ముగిసీ ముగియక ముందే తానాలోని ఇరు వర్గాలతో పాటు గోగినేని కూడా “ఫేస్ బుక్” ను పెటపెటలాడిస్తున్నారు. ఇతర సామాజిక మాధ్యమాల్లోని తమ వాదనలను వినిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ చరిత్ర కలిగిన తానా ప్రతిష్టకు భంగం కలగకుండా పోటీలో ఉన్న వ్యక్తులు హుందాగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి తానా పరువు ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని తానా సభ్యులతోపాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు కూడా కోరుకుంటున్నారు.
కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్