Health

ఇంట్లో వ్యాయామం చాలా ప్రమాదకరం

ఇంట్లో వ్యాయామం చాలా ప్రమాదకరం

ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వే ప్రకారం కొవిడ్‌-19 నేపథ్యంలో భారతీయులు జీవనశైలిని పూర్తిగా మార్చుకుంటున్నారని గుర్తించారు. హైదరాబాద్‌, విశాఖ సహా ముంబయి, దిల్లీ, పుణె, కోల్‌కతా తదితర ప్రధాన నగరాల్లో 22-56 మధ్య వయస్కులు 2,428 మందితో ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. 70 శాతంమంది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తేలింది. 73 శాతం మంది జంక్‌ఫుడ్‌ వల్ల అనర్థాలపై అవగాహన పెరిగిందని చెప్పారు. 70 శాతం మంది ఆరోగ్య అలవాట్లు, శారీరక వ్యాయామంతో రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు సిద్ధపడుతున్నట్టు వివరించారు. 60-70 శాతం మందికి పైగా వ్యాయామంపై దృష్టి పెట్టామని తెలిపారు.
అంతేకాదు స్విగ్గీ ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా అందజేసిన 50,000 సర్వీసులలో ఎక్కువశాతం తృణధాన్యాలు, సేంద్రియ కూరగాయలు, పండ్లకు సంబంధించిన ఆహార పదార్థాలే ఉండటం ఆరోగ్యం పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహనకు నిదర్శనం. కరోనా నేపథ్యంలో చాలామంది సొంతగా వ్యాయామ పరికరాలు కొనుక్కుని ఇంట్లోనే వర్కవుట్స్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో వ్యాయామ పరికరాల విక్రయాలు 170 శాతం పెరిగినట్టు ఓ సర్వేలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, సూర్యాపేట, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రధాన నగరాలు/పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 40-45 శాతం వ్యాయామ సాధనాల విక్రయాలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. అయితే నిపుణుల పర్యవేక్షణలో శాస్త్రీయంగా చేయాల్సిన పద్ధతులను సొంతంగా సాధన చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఇలా ప్రమాదం
* జిమ్‌లలో చేసే వ్యాయామంలో అలసట రెండు రకాలు. ఒకటి కార్డియో ఫెటిక్‌, రెండు సిస్టమిక్‌ఫెటిక్‌/లోకల్‌ ఫెటిక్‌
* కార్డియో ఫెటిక్‌లో గుండెవేగం పెరిగి ఊపిరితిత్తులు సహకరించనపుడు నిస్సత్తువకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.
* మజిల్‌ఫేటిక్‌లో కండరాలు పట్టేయటం వల్ల నీరసం ఆవహిస్తుంది.
* ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బట్టి వ్యాయామం చేయాలి. కొన్ని వ్యాయామాలు చేసేటప్పుడు కొబ్బరినీళ్లు, నీళ్లు, మజ్జిగ వంటివి అదనంగా తీసుకోవాలి. అది లేకుండా కొందరు శరీరాన్ని డీహైడ్రేషన్‌లోకి తీసుకెళుతున్నారు.
* శరీర సామర్థ్యం గుర్తించకుండా అతిగా కసరత్తు చేస్తుంటారు. శరీరానికి సరైన నీటిని అందివ్వకుండా శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తారు. దీనివల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
* గంటల తరబడి వాకింగ్‌ చేసినా ఊబకాయం/అధికబరువు తగ్గకపోవటానికి కారణం శాస్త్రీయంగా చేయకపోవటమే.
* సొంత జిమ్‌లలో వ్యాయామం చేసేవారిలో ఎక్కువమంది జాయింట్‌, లెగ్‌మెంటెన్‌, టెన్నిస్‌బ్రేక్‌, మజిల్స్‌ మూమెంట్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలా శ్రేయస్కరం
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుని కండరాలను దృఢంగా మార్చుకోవటమే వ్యాయామం ఉద్దేశం .
* యూట్యూబ్‌, యాప్‌లను చూసి వ్యాయామం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ సూచనలు చేస్తున్న వారిలో నైపుణ్యత ఎంత ఉందనేది గమనించాలి.
* ఫలానా జ్యూస్‌ తాగితే కండలు వస్తాయి. ఇది తీసుకుంటే వారంలో పది కిలోల బరువు తగ్గుతారనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
* సైక్లింగ్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌ మూడు ఉత్తమ వ్యాయామ మార్గాలు. వీటిలో నడక (వాకింగ్‌) అత్యుత్తమమైనది.
* సిక్స్‌ ప్యాక్‌.. కండలు పెంచినంత తేలిక కాదు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీన్ని సొంతగా ప్రయత్నించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.
* వ్యాయామం తరువాత నిస్సత్తువ, నీరసంగా ఉన్నారంటే అతిగా కష్టపడుతున్నారని గమనించాలి. సమయాన్ని తగ్గించుకుంటే సరిపోతుంది.
* శరీరం దృఢంగా మారేందుకు అడ్డదారులుండవు. ఏవో పౌడర్లు, పానీయాలు శరీర సౌష్టవాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తాయంటే నమ్మి అనారోగ్యం పాలు కావద్దు