రామతీర్థం పర్యటనకు వెళ్తున్న తెదేపా శ్రేణుల వాహనాలను విజయనగరంలో పోలీసులు అడ్డుకున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటన నేపథ్యంలో కోదండరాముడి ఆలయాన్ని సందర్శించేందుకు ఈ ఉదయం తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి నుంచి రామతీర్థం బయల్దేరారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీనేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు భారీ కాన్వాయ్‌తో రామతీర్థం బయల్దేరారు. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌లోని తెదేపానేతల వాహనాలను విజయనగరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది వాహనాలను మాత్రమే అనుమతించి నేతల వాహనాలను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విజయనగరంలో చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విజయనగరంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నేతల వాహనాలు వెళ్లకుండా లారీలు అడ్డుపెట్టారు. చంద్రబాబుతో పాటు తాము కూడా రామతీర్థం వెళ్లేందుకు అనుమతించాల్సిందేనని తెదేపా నేతలు పట్టుబట్టారు. అయినా పోలీసులు అనుమతించకుండా మాజీ హోం మంత్రి చినరాజప్పతో పాటు పలువురు ముఖ్యనేతలను అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన జగన్
Related tags :