DailyDose

యువరాజ్‌సింగ్‌పై FIR నమోదు-నేరవార్తలు

Haryana Police File FIR Against Yuvaraj Singh On Caste Comments

* భారత మాజీ క్రికెటర్‌, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. యువీ గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలకు గానూ.. హరియాణా పోలీసులు ఆదివారం అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఓ అడ్వకేట్‌ ఫిర్యాదు మేరకు హిసార్‌లోని హాన్సీ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం యువరాజ్‌పై కేసు నమోదైంది. అనంతరం పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 295, 505తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌) కింద ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశారు.

* తిరువూరు చీరాల సెంటర్ రామాలయం వద్ద ద్విచక్ర వాహనం డీకొని యువతికి గాయాలు.మద్యం మత్తులో మితిమీరిన వేగంతో యువతిని డీకొట్టి దూసుకుపోయిన ఇరువురు యువకులు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీస్ లు. ప్రమాదానికి కారణమైన బైకిస్టులు లైటింగ్ వర్కర్లుగా గుర్తింపు. యువతిని ఆసుపత్రికి తరలించిన ఆ ప్రాంతవాసులు. నిందితుల ఆచూకి వెతుకుతున్న పోలీసులు. పట్టణంలో ఇటీవలి కాలంలో పేట్రేగిపోతున్న యువత. అడ్డు అదుపు లేకుండా బైక్ లపై విన్యాసాలు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.

* తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరవక ముందే.. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి వద్ద సోమవారం ఉదయం ఎస్సారెస్పీ కాల్వలోకి ఓ కారు దూసుకెళ్లింది. భార్య, కుమారుడు, కుమార్తె సహా అమరేందర్‌రావు అనే న్యాయవాది కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కుమారుడు జయంత్‌ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు క్రేన్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కారుతోపాటు మృతదేహాలను వెలికితీశారు.

* సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో చోటుచేసుకుంది. వికలాంగుల కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీలో నివాసం ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న అలీం(13), వెంకటసాయి(13), రాజేష్(13) స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురు సరదాగా చెముడుగుంట చెరువులో ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు పిల్లలు చెరువులో గల్లంతయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. పిల్లల సైకిళ్లు, దుస్తులు చెరువు గట్టుపై చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి వీలు కాకపోవడంతో ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.

* నగరంలోని ఎంజీబీఎస్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి బైకుపై వెళుతున్న యువకులు రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఆ సమయంలో అటు వైపు వెళుతున్న లారీ వారి పై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఫసీఖాన్‌(19), మోసిన్‌(23) చాదర్‌ఘాట్‌ మూసానగర్‌ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

* అక్రమ నిర్మాణాలే ఆదాయ మార్గాలుగా ఎంచుకుని నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్న వసూల్‌ రాజా-1ను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన నాలుగు రోజులకే మరో వసూల్‌ రాజా పోలీసుల చేతికి చిక్కాడు. తాజాగా దొరికిన వ్యక్తి గుత్తేదారుగా వ్యవహరించాడు. ఎవరిని ఏవిధంగా బెదిరించి డబ్బు సంపాదించొచ్చో తెలుసుకున్నాడు. దాన్నే వృత్తిగా మార్చుకున్నాడు. రూ.లక్షలు సంపాదించాడు. ఇదీ మియాపూర్‌ పరిధి మయూరినగర్‌కు చెందిన చింతపల్లి వెంకట సత్య వీర వేణుగోపాల్‌(52) నైజం. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో భవన నిర్మాణదారులను బెదిరించి రూ.లక్షలు వసూలు చేసినందుకు ఇతన్ని పోలీసులు శనివారం పొద్దుపోయాక అరెస్టు చేశారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. వేణుగోపాల్‌ కొంతకాలం కిందట గుత్తేదారుగా ప్రభుత్వ పనులు చేశాడు. తర్వాత ట్రావెల్స్‌, స్థిరాస్తి వ్యాపారం చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలపై కన్నేసి తెల్లవారుజామున 4 గంటలకే అక్కడ వాలిపోయేవాడు. వాటి ఫొటోలు తీసి నిర్మాణదారుల ఫోన్‌ నంబర్లను కాపలాదారుల నుంచి తీసుకుంటాడు. ఆ భవన నిర్మాణాల వివరాలను సహ చట్టం ద్వారా సేకరిస్తాడు. వాటిని అడ్డం పెట్టుకుని నిర్మాణదారులను బెదిరించేవాడు. వారు లొంగకపోతే జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసేవాడు. అధికారుల నుంచి ఒత్తిడి పెరగగానే కొందరు వేణుగోపాల్‌ను ఆశ్రయించేవారు. అయినా లొంగని నిర్మాణదారులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాడు. లోకాయుక్త ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ చర్యలకు సిద్ధమైతే ఆ నిర్మాణదారులు సైతం వేణుగోపాల్‌ గుప్పెట్లోకి వచ్చేవారు. అప్పుడు అతను అన్ని ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటాడు. ఇలా కేపీహెచ్‌బీ పరిధిలో ఏడేళ్లుగా బెదిరిస్తూ డబ్బు వసూలు చేసేవాడు. ఇతని వేధింపులు తట్టుకోలేక నిర్మాణదారులు కిలారి చలపతిరావు, వల్లపు వెంకటేశ్వర్లు, గుంజి వేణుబాబు, ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేణుగోపాల్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చరవాణితోపాటు పత్రాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.