* ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. అంతేగాక ఇస్రో 50ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటం, భగవద్గీత కాపీ, 25,000 మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.
* చెన్నైలోని కొట్టంబాకం ప్రాంతానికి చెందిన పలువురు అభిమానులు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిధి అగర్వాల్‌కు విగ్రహాన్ని సిద్ధం చేయించి.. దానికి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా పాలాభిషేకాలు, హారతులిచ్చి నటిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమానులు తనపై చూపించిన ప్రేమకు నిధి ఫిదా అయ్యారు. ‘నెట్టింట్లో ఫొటోలు చూసి షాక్ అయ్యాను. ప్రేమికుల దినోత్సవం రోజున నేను పొందిన అపురూపమైన బహుమతి ఇదే. నాపై ప్రేమ చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మరిన్ని మంచి కథా చిత్రాలతో మిమ్మల్ని అలరిస్తాను’ అని నిధి తెలిపారు. మరోవైపు నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరసన నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూట్‌లో ఇటీవల ఆమె పాల్గొన్నారు.
* కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ భాజపా నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేతలు ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని రాజకీయ పక్షాలు గత కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా నేతలు కేంద్రమంత్రిని కలిసి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సోము వీర్రాజు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.
* డబ్బు కన్నా వ్యక్తిగత ప్రైవసీకే ప్రజలు ఎక్కువ విలువిస్తారని, అందువల్ల ఆ గోప్యతను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన గోప్యతా విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, వాట్సాప్‌కు నోటీసులు జారీ చేసింది.
* విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 18న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలని శ్రేణులను ఆదేశించారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా తెదేపా సిద్ధమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు తెదేపా విశ్రమించదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన కేసుల మాఫీ కోసం ప్రైవేట్ పరం చేస్తూ, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పోస్కోతో లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మిగులు భూమి 8వేల ఎకరాలను కాజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారని చంద్రబాబు దుయ్యబట్టారు.
* మయన్మార్‌లో పాలనను సైన్యం హస్తగతం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మరోవైపు యాంగూన్‌లో సైనిక సాయుధ శకటాలు తిరుగాడటం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారన్న ప్రచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైనిక ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ లెక్కచేయకుండా ఆదివారం యాంగూన్, మాండలే, నేపిటవ్ తదితర నగరాల్లో పెద్దఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘సైబర్‌స్పేస్’లోనూ భారీగా నిరసన వ్యక్తమవుతోంది. ‘బ్రదర్‌హుడ్ ఆఫ్ మయన్మార్ హ్యాకర్స్’ అనే సంస్థ ఏకంగా ప్రభుత్వ డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్‌లో సమాచారాన్నే మార్చేసింది. హోంపేజీలో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా సమాచారాన్ని, ఫొటోలను పెట్టింది. యాంగూన్‌లో చైనాను వ్యతిరేకిస్తూ.. అమెరికాను అభినందిస్తూ.. ఆయా రాయబార కార్యాలయాల ఎదుట ఆందోళనకారులు ప్రదర్శన చేపట్టారు. మిలటరీ పాలనను ప్రోత్సహిస్తోందంటూ చైనాకు వ్యతిరేకంగా నినదించారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలకు మద్దతిస్తున్న అమెరికాను శ్లాఘించారు. సైన్యంతో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాలనూ తిరస్కరించాలంటూ ఆందోళనకారులు ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా నిరసనల్లో ప్రభుత్వ సిబ్బంది చురుగ్గా పాల్గొంటున్నారు. రైల్వే కార్మికులు కూడా ఆందోళనల్లో చేరినట్లు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
* అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పరపతిని ఆమె సమీప బంధువు మీనా హారిస్ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకొనేందుకు వాడుకోవడంపై శ్వేతసౌధం అభ్యంతరం తెలిపినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కమలా అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా మీనా ధోరణి మారకుంటే.. ఇటువంటి సున్నితమైన అంశాలే బైడెన్-హారిస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
* దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నప్పటికీ మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి అదుపుకావట్లేదు సరికదా.. వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా ఐదో రోజు.. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమేగాక, దాదాపు నెల రోజుల తర్వాత కొత్త కేసులు మరోసారి 4వేలపైకి చేరాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మరో 4,092 కొవిడ్ కేసులు బయటపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
* పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ రైతుల ఆందోళనల ప్రణాళిక ‘టూల్‌కిట్’ను షేర్ చేసిన కేసులో పర్యావరణ కార్యకర్త దిశ రవిని అరెస్టు చేశారు. కాగా, ఘటనను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఈ అరెస్టు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
* ఇటీవలి కాలంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ధరలు పెంచి సామాన్య ప్రజానీకాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందిస్తూ..‘ఇద్దరికి లబ్ధి చేకూర్చేందుకు, ప్రజల్ని దోచుకుంటున్నారు’ అంటూ విమర్శలు చేశారు. అలాగే గ్యాస్ ధరల పెంపుపై వచ్చిన మీడియా కథనాన్ని షేర్ చేశారు. ఇప్పటికే పలు మార్లు ‘ఇద్దరు’ అని ప్రస్తావిస్తూ రాహుల్ భాజపాపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
* బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ ప్రమాదకరమైందేనని అక్కడి ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇతర వైరస్‌లతో పోలిస్తే దాదాపు 70శాతం ఎక్కువ ముప్పు ఉందని, ఇందుకు వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులే(మ్యుటేషన్‌లు) కారణమవుతున్నాయని మరోసారి స్పష్టంచేసింది. కొత్తరకం వైరస్ తీవ్రతను అంచనా వేసేందుకు ఏర్పాటు చేసిన సలహా బృందం ఇచ్చిన తాజా నివేదికను అక్కడి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
* దిల్లీకి చెందిన సూఫియా అనే యువతి 135 రోజుల్లో దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యంగా పరుగును ప్రారంభించారు. సుమారు ఆరువేల కిలోమీటర్ల దూరాన్ని చుట్టిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తన పరుగు కొనసాగుతోంది. దిల్లీ నుంచి ముంబయి, చెన్నై, కోల్‌కతా మీదుగా దిల్లీ చేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు.
* ఉత్తరాఖండ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 53కు పెరిగింది. ఈ ఉదయం ఎన్టీపీసీ తపోవన్ ప్రాజెక్టు ప్రాంతంలోని అదిత్ సొరంగం వద్ద మరో మూడు మృతదేహాలు బయటపడినట్లు జిల్లా కలెక్టర్ స్వాతి బదౌరియా వెల్లడించారు. హిమనీ నదంలో నుంచి భారీ మంచు పెళ్లలు విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో ఫిబ్రవరి 7న తపోవన్ ప్రాంతంలో మెరుపు వరదలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
* ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ మొబైల్ మార్కెట్ అమ్మకాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది శాంసంగ్. బడ్జెట్, మిండ్ రేంజ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. తాజాగా గెలాక్సీ ఎఫ్62 పేరుతో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో క్వాడ్ రియర్ కెమెరా, పంచ్ హోల్ డిస్‌ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్, ఫోన్ వెనక వైపు మెటల్ ఫినిషింగ్ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు.
* వ్యాపారవేత్త, హీరో సచిన్ జోషి అరెస్టయ్యారు. ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ని ఆదివారం రాత్రి ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. జేఎంజే పేరిట ఉన్న బిజినెస్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి ఒకరు. అయితే.. ఓ స్థిరాస్తి అభివృద్ధి ప్రాజెక్టులో ఓంకార్ సంస్థ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో జేఎంజే గ్రూపునకు కూడా ప్రమేయం ఉన్నట్లు తేలడంతో సచిన్ జోషిని దాదాపు 18 గంటల పాటు విచారించారు.