Business

ఇక కెనడాలో అధికారికంగా బిట్‌కాయిన్-వాణిజ్యం

ఇక కెనడాలో అధికారికంగా బిట్‌కాయిన్-వాణిజ్యం

* డిజిటల్‌ క్రిప్టో క‌రెన్సీ అయిన బిట్ కాయిన్ పై అనేక ప్ర‌పంచ దేశాలు, సెంట్ర‌ల్ బ్యాంకుల ఆంక్ష‌ల విధించిన‌ క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో కూడా స‌రికొత్త రికార్డులు నెల‌కొల్పుతున్న‌ది. రూ.35 ల‌క్ష‌లు దాటిన బిట్ కాయిన్ ధర రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం అన్ని దేశాల ఆమోదం నిదానంగా పొందుతోంది. ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఫైనాన్సింగ్ సేవ‌ల సంస్థ‌లైన జేపీ మోర్గాన్, వీసా, పేపాల్‌, మాస్ట‌ర్ కార్డ్ మ‌ద్ద‌తునూ కూడా పొందింది. తాజాగా బంగారం మాదిరే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్‌కు కెనడాకు చెందిన ప్రధాన సెక్యూరిటీ రెగ్యులేటర్ ఒంటారియో సెక్యూరిటీస్ క‌మిష‌న్ అనుమతి ఇచ్చింది.

* వ్యాపారవేత్త, హీరో సచిన్ జోషి అరెస్టయ్యారు. ఓంకార్ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు ఆయన్ని ఆదివారం రాత్రి ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. భారత కంపెనీలు విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల నేపథ్యంలో నేడు భారత ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు మరో రికార్డు స్థాయిని సాధించాయి. భారతీయ కంపెనీలు డిసెంబర్ త్రైమాసిక లాభాలలో గత ఏడాదితో పోలిస్తే 49 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 నాలుగు త్రైమాసికాలలో ఇదే అతిపెద్ద పెరుగుదల. దీనితో సెన్సెక్స్ 692 పాయింట్లు పెరిగి 52,235.97 రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా 50 ఇండెక్స్ పెరిగి 15,300ను అధిగమించింది. నేడు సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 1.18 శాతం పెరిగి ఆల్ టైమ్ హై 52,154 వద్ద ముగిసింది. నిఫ్టీ 1 శాతం లేదా 151 పాయింట్లు పెరిగి 15,315 వద్ద స్థిరపడింది. కరోనా తర్వాత కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు వేగంగా పుంజుకోవడంతో మార్కెట్లు కూడా భారీ లాభాలతో ముగిసినట్లు విశ్లేషకులు తెలిపారు.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. వరుసగా ఏడో రోజూ ధరల పెరుగుదల కొనసాగడంతో.. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర సెంచరీకి దగ్గరగా వెళ్తోంది. ఇక ఇంధన పన్ను అధికంగా విధిస్తోన్న రాజస్థాన్‌లో పెట్రోల్‌ ధర రూ.99.56కి చేరింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల లీటరు ధర సెంచరీ దాటింది.

* డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి జపాన్‌ వార్షిక వృద్ధి రేటు 12.7 శాతానికి పుంజుకుంది. మూడో త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదు కావడంతో.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల్లో పైకి ఎగబాకింది. కరోనా నేపథ్యంలో అంతకుముందు త్రైమాసికాల్లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు, దేశవ్యాప్తంగా వినిమయం పుంజుకోవడం వల్లే వృద్ధి నమోదైందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2020లో జపాన్‌ వృద్ధి రేటు 4.8 శాతం కుంగింది. గత 11 ఏళ్లలో ఆ దేశ వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.