వెలిగొండ ప్రాజెక్టుకు ఆకృతిని తీసుకొచ్చేందుకు సహకరించిన టన్నెల్ బోరింగ్ మిషన్ తన కర్తవ్యాన్ని పూర్తి చేసింది. నిరంతరంగా పుష్కర కాలంపాటు విశిష్ట సేవలందించిన ఈ యంత్రాన్ని తిరిగి వెనక్కి తెచ్చే అవకాశం లేక చివరకు ధ్వంసం చేయాల్సి వచ్చింది. గంగమ్మకు దారి చూపేందుకు వచ్చిన ఈ యంత్రాన్ని స్థానికులు అపురూపంగా చూశారు. యంత్రంలో ఉన్న సాంకేతిక పరికరాలను చూసి అబ్బురపడ్డారు. 3 జిల్లాల్లో 15 లక్షల మంది ప్రజల దాహార్తిని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఈ బోరింగ్ మిషన్ ఉపకరించింది. నల్లమల కొండలను కిలోమీటర్ల కొద్దీ ఇది తొలిచింది. శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి 43.5 టీఎంసీల వరద జలాలను 3జిల్లాలకు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్టుకు ఏళ్ల కిందటే రూపకల్పన చేశారు. ఇక్కడి నల్లమల కొండలను తొలిస్తే.. ఏర్పడే సొరంగ మార్గం వద్దకు శ్రీశైలం జలాలు ప్రవాహ ఒత్తిడితో గ్రావిటీ ద్వారా సరఫరా చేసే వీలుందని ఇంజినీర్లు ప్రణాళిక రూపొందించారు. కొండలను పేల్చి పని చేసేందుకు అటవీ, పర్యావరణ శాఖలు అనుమతించలేదు. టన్నెల్ నిర్మాణానికి బోరింగ్ మిషన్ తప్పక అవసరమని నిర్ణయించి రూ.128 కోట్లు వెచ్చించి జర్మనీ నుంచి 2008లో తెప్పించారు. మొదటి టన్నెల్ 18.8 కి.మీ.మేర తవ్వాల్సి వచ్చింది. 2008 నుంచి వేర్వేరు సంస్థలు ఈ పనులు చేపట్టాయి. బోరింగ్ మిషన్‌కు కన్వేయర్ బెల్టు ఉంటుంది. ఈ బెల్టు సాయంతో బ్లేడులు కొండను తొలుస్తూ వెళతాయి. యంత్రం చెడిపోతే అవసరమైన విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, మరమ్మతు చేసే నిపుణులు విదేశాల నుంచి రప్పించాల్సిన పరిస్థితుల్లో పనులు ఆలస్యమయ్యాయి. మేఘా ఇంజినీరింగు కంపెనీ ఇటీవలే ఈ పని పూర్తి చేసింది. ఈ యంత్రం కొండను తొలుస్తూ ముందుకెళ్లడమే తప్ప వెనక్కు తెచ్చే వీలులేదు. మొదటి టన్నెల్‌ను నిర్మించడంతో యంత్రాన్ని ఈ మధ్యే 99శాతం ధ్వంసం చేసి విడిభాగాలను తుక్కుగా బయటకు తెచ్చారు. రెండో వైపు పూర్తిగా శ్రీశైలం జలాలు ఉండటం వల్ల యంత్రాన్ని బయటకు తీసుకురాలేని పరిస్థితి ఉంది. టన్నెల్ రెండో భాగం శ్రీశైలం జలాశయంలో 60 అడుగుల దిగువన ఉండటం మరో కారణం. పైన దాదాపు 100 టీఎంసీలకుపైగా నీళ్లుంటాయని ఇంజనీర్లు చెబుతున్నారు. యంత్రం బరువు 2000 టన్నులుంటుంది. అటువైపు నుంచి బయటకు తీసుకురావడం ప్రమాదకరమని, ధ్వంసం చేయడం అనివార్యమని నిపుణులు చెబుతున్నారు.
తుక్కుగా మారిన వెలిగొండ ప్రాజెక్టు బోరింగ్ మిషన్
Related tags :