* రేపు రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.మూడో విడత 3,221 పంచాయతీలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.వీటిలో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమవ్వగా, రేపు 2,639 సర్పంచి స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.2,639 పంచాయతీలకు 7,757 మంది సర్పంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.మూడో విడత 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమవ్వగా, 19,553 వార్డు స్థానాలకు పోటీ జరగనుంది.వార్డు స్థానాలకు 43,162 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.
* కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు.నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 23ని గడువుగా పేర్కొన్నారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. 26వ తేదీ వరకూ నామినేషన్ పత్రాల ఉపసంహరణకు అభ్యర్థులకు అవకాశమిచ్చారు.మార్చి 14వ తేదీన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఎన్నిక జరుగుతుందని నోటిఫికేషన్ లో పేర్కోన్నారు
* పేద ఆర్యవైశ్యల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ భవనం రేపు ప్రారంభోత్సవం చేయనున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు సిఎ పెనుగొండ సుబ్బారాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
* విశాఖ స్టీల్‌పై ప్రధానికి లేఖ రాస్తే జైల్లో వేస్తారని చంద్రబాబుకు భయమా? అని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
* ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ తెచ్చిన జీవోలు 81, 85లను హైకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే, ముఖ్యమైన కేసు విచారణ ఉండటంతో ఆంగ్ల మాధ్యమం కేసు విచారణ వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు. తదుపరి విచారణ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
* వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని భావిస్తోన్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా కొత్తరకం కరోనా కేసులు భారత్‌లోనూ వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బ్రెజిల్ రకానికి చెందిన కొత్తరకం ఒక కేసు నమోదు కాగా, దక్షిణాఫ్రికా రకం కేసులు నాలుగు నిర్ధారణ అయినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. వైరస్ నిర్ధారణ అయిన వారితోపాటు వారికి సన్నిహితంగా మెలిగిన వారిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు.
* పురపాలక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ).. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టిసారించింది. ఆ ఎన్నికలను కూడా నిలిపిన చోట నుంచి కొనసాగించాలా? కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా?అనే విషయంపై న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎక్కువ చోట్ల అధికార వైకాపా అక్రమంగా ఏకగ్రీవం చేసిందని విపక్షాలు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చర్చలు జరుపుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా వచ్చిందా? వస్తే అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
* లద్దాఖ్‌లో చైనా సైన్యం మెల్లిగా వెనక్కి తగ్గుతోంది. గతవారం కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ దేశ దళాలు తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నాయి. ఫింగర్-8 అవతల వైపునకు వెళ్లే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇక్కడ ఏప్రిల్ 2020లో నిర్మించిన కట్టడాలను తొలగిస్తున్నారు. భారత్ కూడా ఇక్కడ బలగాల ఉపసంహరణను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకుంటోంది.
* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నిర్వహించే ‘కల్యాణమస్తు’ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఏటా ఈ కార్యక్రమం ద్వారా తితిదే పేదలకు ఉచిత వివాహాలు జరిపిస్తోంది. రేపు ఉదయం ఆలయం వద్దనున్న నాదనీరాజన వేదికపై పండితులు లగ్నపత్రిక రాయనున్నట్లు తితిదే వెల్లడించింది. లగ్నపత్రికను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నారు.
* ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, కోడలు శైలిమ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పార్లమెంటు లోపల, బయట వ్యతిరేకించినట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సీఎం జగన్ కూడా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తు్న్నారన్నారు. సీఎం జగన్ త్వరలోనే కార్మిక సంఘాలతో భేటీ అవుతారని చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీని కలిసేందుకు జగన్ సమయం అడిగినట్లు చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 20న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేయనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు దాదాపు 25 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లనున్నట్లు చెప్పారు. పాదయాత్ర అనంతరం కూర్మన్నపాలెంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.