Politics

జగన్ పదవి వదిలేస్తే….నేను అహం వదిలేస్తా!

జగన్ పదవి వదిలేస్తే….నేను అహం వదిలేస్తా!

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే ఉద్యమానికి మద్దతుగా వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే ఒక్క నిమిషంలోనే తామూ రాజీనామా చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘సీనియర్‌ నాయకుడిననే అహం లేకుండా పరిశ్రమను కాపాడుకోవడానికి సీఎం ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలకు సహకరించేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తా. ఈ విషయంలో ప్రభుత్వంపైనే ఎక్కువ బాధ్యత ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. సమీప ప్రైవేటు ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. పల్లా శ్రీనివాసరావుకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం విశాఖకు వచ్చిన చంద్రబాబు ఆసుపత్రిలో ఆయన్ని పరామర్శించారు. నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. అలాగే కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంటు ప్రవేశద్వారం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉక్కు నిర్వాసితుల సంఘాలు చేపట్టిన దీక్షా శిబిరాల వద్దకు చేరుకొని మద్దతు తెలిపారు.