Devotional

బ్రాహ్మణులకు ఘోరమైన శిక్ష…కుక్కచ్చు

Kukkachu - A Horrible Punishment To Brahmins In Olden Days

కుక్కచ్చు అనేది బ్రాహ్మణులకు విధించే గొప్పఘోరమైన శిక్ష. ఆనాడు సమాజంలో బ్రాహ్మణులకు శిక్షలు మరి కఠినంగా వుండేవి కావు. ఎంత ఘోరమైన నేరం చేసినప్పటికి మరణదండన ఉండేది కాదు. హత్యలు మానభంగం దేశద్రోహం రాజద్రోహం వంటి నేరాలకు దేశ బహిష్కరణ లేదా కండ్లు పెరికించడం లేదా కారాగారవాసంలో వుంచడం చేసేవారు. బ్రాహ్మణజాతిలో నేరాల సంఖ్య బహుస్వల్పంగానే వుండేది.
బ్రాహ్మణులను శిక్షల ద్వారా అవమానించడమనేది వారికి గొప్ప తలవంపు. ఇది అత్మహత్యా సదృశ్యంగా వుండేది. ఈ విషయాన్ని కేతన తన విజ్ఞానేశ్వరీయంలో ఎలా చెప్పాడో చూద్దాం.

తల గొరిగించి కుక్కడుగు తప్పక ఫాలభాగమందు వ్రాసి ముం
గల ధనమెల్ల బుచ్చుకొని గాడిద నెక్కగ జేసి గ్రామమున్‌
వెలువడ ద్రోచి పుచ్చుటయు విప్రుని జంపుట క్షుద్ర జంతులన్
జొలువన చంపు తప్పు గలచో దగు చంపుట ధర్మమెమ్మెయిన్.

కుక్కచ్చు అంటే కుక్కపాదంలా వున్న అచ్చును నుదుటన ముద్ర వేయడం. ఒకానొక విప్రుడు నేరం చేశాడు. అతనికి మరణ సమానమైన శిక్ష విధించాలి. అందుకై కుక్కపాదం వున్న ఇనుప శలాకను బాగాకాల్చి ఫాలభాగంలో అచ్చువేశారు. అతని దగ్గరున్న ధనాన్ని దండన కింద తీసేసుకున్నారు. తలకొరిగించారు. గాడిదపై ఎక్కించి వూరంతా తిప్పి వదిలేశారు.ఇలాంటి వారికి మరణశిక్ష విధించడమంటే క్షుద్ర జంతువును చంపడంలాంటిదని తెలియచేశాడు. జంతువులలో క్షుద్రజంతువులుంటాయా? ఇక్కడ క్షుద్రజంతువంటి హీనజంతువులని అర్థం. అవి కుక్క గాడిద నక్క సూకరం మొదలైనవి.