Politics

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ…వైకాపాకు రాజీనామా-తాజావార్తలు

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ…వైకాపాకు రాజీనామా-తాజావార్తలు

* వైసీపీకి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు రాజీనామా.- కుటుంబ విభేదాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన.- ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు.- ఏ పార్టీలో చేరే అంశంపై త్వరలో ప్రకటిస్తా : చంద్రశేఖర్ రాజు.

* పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతూ అర్థరాత్రి సమయాల్లో ఫలితాలను వారికి అనుకూలంగా మార్చుకుంటూ ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

* డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ తీరులో మార్పు వచ్చింది.ఎన్నికల ఫలితాలని చూశాక ఆయన రియలైజ్‌ అయ్యారు.మొదట చంద్రబాబు తో కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారు.కానీ ప్రజల మద్దతు చూశాక ఆయన మారిపోయారు.ఇప్పుడు చంద్రబాబు కూడా నీ వల్లే మేము ఓడిపోయామంటూ నిమ్మగడ్డ ని తిడుతున్నారు.

* తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేస్తోన్న విమర్శలను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. ధైర్యముంటే మొదట తన అల్లుడు అభిషేక్‌ బెనర్జీపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాతే తనను ఎదుర్కోవాలని అమిత్‌ షాకు సవాల్ విసిరారు. దక్షిణ పరగణాల జిల్లాలోని పైలాన్‌ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో బెంగాల్‌ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిపై విరుచుకుపడ్డారు.

* భారత దేశానికి చెందిన పెట్టుబడుల నిపుణురాలు ఉషారావు మొనారీని ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం’ (యూఎన్‌డీపీ)లో అండర్‌ సెక్రటరీ జనరల్‌గా, సహాయ పరిపాలకురాలిగా నియమిస్తూ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెట్టుబడుల్లో, ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంపై ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. బ్లాక్‌స్టోన్‌ గ్రూపులో ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు.

* హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతుల హత్యకేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిపై అభియోగాలు నమోదు చేశారు. వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు 120బి, 302, 341, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎ-1గా వెల్ది వసంతరావు, ఎ-2గా కుంట శ్రీనివాస్‌, ఎ-3గా అక్క పాక కుమార్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. మరో వైపు పోస్టు మార్టం అనంతరం మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం గుంజపడుగుకు తరలించారు. కత్తిపోట్ల అనంతరం రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్‌’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపించింది. న్యాయవాద దంపతులను పథకం ప్రకారమే హత్యచేశారని వామన్‌రావు తండి కిషన్‌రావు ఆరోపించారు. పూదరి లచ్చయ్యపై అనుమానం ఉందని, హత్యకు ముందు లచ్చయ్య రెక్కీ నిర్వహించారని తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుపై కూడా అనుమానం ఉందన్నారు.

* కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలతో మైనారిటీలో పడిన నారాయణస్వామి ప్రభుత్వానికి బలం నిరూపించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఈ నెల 22 సోమవారం సాయంత్రం ఐదు గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణకు ఆదేశించారు. దీంతో ఆ రోజు నారాయణ స్వామి ప్రభుత్వ భవితవ్యం తేలనుంది.

* తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్య అని.. ఈ హత్యల వెనక తెరాస హస్తం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని.. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామన్నారు.

* రాజకీయ జీవితంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ లెజెండ్‌గా జీవించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన రాజకీయ జీవితం శోభాయమానంగా ఉండేదని చెప్పారు. హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ‘మేవరిక్‌ మెస్సయ్య’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ రాజకీయ జీవిత విశేషాలపై కందుల రమేశ్‌ ఈ పుస్తకాన్ని రచించారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని ప్రతిపక్షాలను బలోపేతం చేసిన ఘనత ఎన్టీఆర్‌ది అని.. నేషనల్ ఫ్రంట్‌ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.

* ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇస్తే అంగీకరించేది లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో ఓటమికి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం జగన్‌ ఓ ప్రతిపాదన చేస్తే దాన్ని ఎగతాళి చేయడం సరికాదని.. పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పాలని చంద్రబాబుకు సజ్జల సూచించారు.

* తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 14మందికి సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి బుధవారం బోయిన్‌పల్లి ఠాణాలో హాజరుకావాలని.. విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 21మందిని అరెస్టు చేశారు. వారిలో అఖిలప్రియ సహా 15మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా.. మరో ఆరుగురు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా భార్గవ్ రామ్, విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

* విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ కీర్తిలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ‘‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’’గా నగరం గుర్తింపు పొందినట్లు మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏవో)తో కలిసి పనిచేసే ఆర్బర్‌ డే ఫౌండేషన్ సంస్థ ఈ బిరుదునిచ్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించడంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపు దక్కడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ రకమైన గుర్తింపు సాధించిన ఏకైక భారతీయ నగరంగా హైదరాబాద్ నిలవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.

* కుప్పంలో తాము గెలవకపోవడం కాదని.. ప్రజాస్వామ్యం ఓడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. డబ్బు పంపిణీతో పాటు అరాచకాలపై ఆధారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్‌ ఎందుకని ప్రశ్నించారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు తమతో మైండ్‌ గేమ్‌ ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపాకు ఓటేయని వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం తెదేపా మద్దతుదారులే గెలిచారన్నారు.

* పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెదేపా నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చిన ఆయనను ఏలూరు గ్రామీణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో బుధవారం రాత్రి చింతమనేని ప్రభాకర్‌ ప్రచారం నిర్వహించారు. అనంతరం వైకాపా-తెదేపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

* కేరళలోని కన్నూర్‌ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి దగ్గు సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళ్లిన మహిళ శ్వాసనాళం విజిల్‌ ఉండటాన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు. ‘కన్నూరు జిల్లా మట్టనూరుకు చెందిన మహిళ ఇటీవల గొంతు సంబంధ సమస్యలతో స్థానికంగా వైద్యశాలకు వెళ్లింది. చాలా కాలం నుంచి సమస్య ఉన్నట్లు వైద్యుడికి వివరించింది. ఈ క్రమంలో స్థానిక వైద్యుడు ప్రభుత్వ వైద్య కళాశాలకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు వైద్య కళాశాలను సంప్రదించిన బాధితురాలికి.. నిపుణులు రాజీవ్‌ రామ్‌, పద్మనాభం పరీక్షలు చేశారు. ఆమె శ్వాసనాళంలో ఓ వైపున విజిల్‌ వంటి చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు విజిల్‌ను బయటకు తీశారు’ అని సుదీప్‌ తెలిపారు.

* దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ కోసం జట్లు విపరీతంగా పోటీ పడ్డాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ అతడిని రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. చివరి వరకు అతడి కోసం పంజాబ్‌ కింగ్స్‌ పోటీ పడింది. మొదట బెంగళూరు ధర పెంచుతూ పోయింది. రూ.5కోట్లు దాటగానే ముంబయి రంగంలోకి దిగింది. రూ.12 కోట్లు దాటగానే రాజస్థాన్‌ రాయల్స్‌ వచ్చింది. ఈ క్రమంలో పంజాబ్‌, రాయల్స్‌ రూ.16 కోట్ల వరకు పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్‌ అతడిని రాయల్స్‌కే విడిచిపెట్టక తప్పలేదు.