Politics

న్యాయవాదుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ బంధువు

న్యాయవాదుల హత్య కేసులో జడ్పీ ఛైర్మన్ బంధువు

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్‌కు కారు ఇవ్వడంతోపాటు హత్యకు వినియోగించిన రెండు కత్తులనూ బిట్టు శ్రీనివాస్‌ అనే వ్యక్తి సమకూర్చాడని పోలీసులు వెల్లడించారు. అతడు పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధుకర్‌కు మేనల్లుడు కావడంతో ప్రాధాన్యం సంతరించుకొంది. పుట్ట మధు తన తల్లి పేరిట నిర్వహిస్తున్న ట్రస్ట్‌ బాధ్యతల్ని ఇతడే చూస్తుంటాడు. కత్తుల్ని మంథనిలో ఓ పండ్ల దుకాణం నుంచి తీసుకొచ్చారనే వాదన వినిపిస్తోంది. ఆ దుకాణం ఓ ప్రజాప్రతినిధికి చెందినది కావడం గమనార్హం. ఆ ప్రజాప్రతినిధిని విచారిస్తే మరిన్ని విషయాలు బహిర్గతమవుతాయని తెలుస్తోంది. అయితే బిట్టు శ్రీనివాస్‌ ఇంకా తమకు చిక్కలేదని పోలీసులు ప్రకటించడంతో అతడు దొరికితే ఇంకెవరి ప్రమేయం ఉందో వెల్లడి కావచ్చని భావిస్తున్నారు. పుట్ట మధుకు సంబంధించి పలు విషయాల్లో న్యాయవాది వామన్‌రావు ఫిర్యాదులు, పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో తాజాగా బిట్టు శ్రీను పాత్రను పోలీసులు ఉటంకించడం సంచలనం రేకెత్తిస్తోంది.