ఆస్ట్రేలియా ఓపెన్ 2021 టోర్నీ నుంచి అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ నిష్క్రమించింది. ఈ టోర్నీలో గెలుపొంది సింగిల్స్‌లో అత్యధికంగా 24 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాలన్న ఆమె కోరిక ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో గురువారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో సెరెనా ఓటమిపాలైంది. మూడో సీడ్ నవోమి ఒసాకా చేతిలో 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో ఓటమి చవిచూసింది. దీంతో మ్యాచ్ అనంతరం సెరెనా అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టును వీడింది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశాన్ని సెరెనా మధ్యలోనే ముగించింది. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె భావోద్వేగానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘ఇదే మీ చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ కాబోతోందా?’ అని అడిగిన ప్రశ్నకు ఆమె కంటతడి పెట్టింది. తర్వాత మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించింది. అయితే, సెరెనా వెళ్లే ముందు ఇలా పేర్కొనడం గమనార్హం.. ‘ఆటకు వీడ్కోలు పలికితే, ఎవరికీ చెప్పకుండా చేస్తానేమో. నాకు తెలియదు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాక అభిమానులకు ఆమె అభివాదం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదే సెరెనాకు తుదిపోరు కావొచ్చని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఓడిపోయిందని ప్రశ్న అడిగితే…ఏడ్చింది!
Related tags :