స్నేహితులు, బంధువులు, తెలిసినవారితో నిత్యం ఫేస్బుక్(ఎఫ్బీ)లో యాక్టివ్‌గా ఉంటున్నారా.. అయితే జాగ్రత్త.. మీ ఖాతాలను సైబర్‌నేరగాళ్లు ఫాలో అవుతున్నారు.. మీ ఫొటో, ప్రొఫైల్‌లోని వివరాలతో మీ ఖాతా మాదిరిగానే ఫేక్ ఎఫ్బీ ఖాతాలను తెరుస్తున్నారు.. ఆ ఖాతాలోకి మీ సర్కిల్లో ఉన్న వారిని ఫ్రెండ్స్‌గా యాడ్ చేస్తూ… అదను చూసి అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ వల వేస్తున్నారు. ఇలా.. వీరి వలలో చిక్కిన కొందరు డబ్బు పోగొట్టుకుంటుండగా.. మరికొందరు అనుమానంతో అసలైన ఖాతాదారుడిని అడిగి తెలుసుకుంటున్నారు.. దీనిపై గత నాలుగైదు నెలలుగా సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా.. ఓ వ్యక్తి… తన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తయారు చేసి, స్నేహితులు, బంధువుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేశారంటూ హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు సైబర్‌నేరగాళ్లు ఎదో ఒక రూపంలో వల వేస్తుంటారు. అందులో ఈ ఫేక్ ఎఫ్బీ ఖాతాల తయారీ కూడా ఒకటి. ఈ ఫేక్ ఖాతాలు మీ పేరుతోనే ఉంటాయి.. ప్రొఫైల్ ఫొటో మీదే ఉంటుం ది.. మీ సర్కిల్లో ఉన్న వారి గురించి ఆరాతీసి.. ఈ తర్వాత వారందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఎవరైనా ఇదేంటీ… మరో ఖాతా ప్రారంభించావా? అని ప్రశ్నిస్తే.. అదేమి లేదు.. ఈ ఖాతా కొత్తగా ప్రారంభిస్తున్నాను.. ఇందులో దగ్గరివాళ్లు మాత్రమే ఉంటారంటూ చెబుతుంటారు.. మొదట ఒకటి రెండు రోజులు హాయ్‌తో పలుకరించి.. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులకు, దగ్గరి బంధువులకు, స్నేహితుడికి అత్యవసరంగా డబ్బులు కా వాలని, దవాఖానలో ఉన్నారని చెబుతుంటారు.. వెంటనే తమకు డబ్బు కావాలంటూ బ్యాంకు ఖాతా నంబర్, గూగుల్ పే నంబర్లు కూడా పంపిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే అధికారుల వ్యక్తిగత పేర్లతోనూ ఈ నకిలీ ఫేస్బుక్ ఖాతాలు, ఈమెయిల్ ఐడీలు తయారు చేస్తున్నారు. పోలీసుశాఖ అధికారుల పేరు తోనూ నకిలీలను సృష్టిస్తున్నారు.. తాజాగా ఒక జాతీయ బ్యాంకుకు చెందిన 30 మందికి సంబంధించిన నకిలీ ఖాతాలను సృష్టించి.. అత్యవసరంగా డబ్బులు కావాలంటూ మెసేజ్‌లు పెట్టారు.. రోజుకు వేల సంఖ్యలో ఇలాంటి నకిలీ ఖాతాలు తెరిచి వల వేస్తున్నారు. మరికొందరు ఇతర దేశాల్లో ఉన్నట్లు చెప్పుకుంటూ, హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న తమ దగ్గరి బంధువు, స్నేహితుడికి డబ్బు అత్యవసరమంటూ నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తయారు చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన భరత్పూర్, అల్వార్ జిల్లాలోని సైబర్ ముఠాలను ట్రై పోలీస్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అయినా.. ఇటీవల ఈ నకిలీ చేష్టలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్, బ్యాంకింగ్ తదితర సెక్టార్లలోని వారిని లక్ష్యంగా చేసుకుంటూ సైబర్‌నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, తమకు అత్యవసరంగా డబ్బు అవసరముందని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి చెల్లిస్తామంటూ నమ్మిస్తున్నారు. వీరి మాట లు నమ్మి కొందరు డబ్బులు కూడా డిపాజిట్ చేసి మోసపోతున్నారు.
మీ పేరు మీద ఫేస్బుక్లో నకిలీ ఐడీ సృష్టించి, మీ స్నేహితులు, బంధువులను డబ్బులు అడుగుతున్నారా? ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.. ఆ నకిలీ ఐడీలో ఉన్న పోస్టులను ఫేస్బుక్ తొలిగిస్తుంది.
ఫేస్బుక్ నకిలీ ఖాతాలో పైన కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి.
దానిపైన క్లిక్ చేయగానే రిపోర్టు ఆప్షన్ ఉంటుంది.
అందులో దాదాపు 20 మంది ఈ పోస్టును డిలీట్ చేయండని పోస్టు పెట్టాలి.
వెంటనే ఫేస్బుక్ ఆ ఖాతాను డిలీట్ చేస్తుంది.
అదే విధంగా ఇలా నకిలీ ఖాతా వచ్చినప్పుడు ఇతరులు మోసపోకుండా ఉండేందుకు..మీ అసలు ఫేస్బుక్ ఖాతాపై ఈ వివరాలను పొందుపర్చవచ్చు. ఇలాగే నకిలీ ఖాతాలో ఇది నకిలీదంటూ పోస్టు పెట్టి స్నేహితులను అప్రమత్తం చేయవచ్చు.
సైబర్‌నేరగాళ్లు.. నకిలీ ఫేస్బుక్ ఖాతాలతో నిత్యం మోసం చేస్తున్నారు.. దీనిపై ప్రతి రోజూ ఫిర్యాదులు వస్తున్నాయి.. అయితే.. ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో కొందరు మోసాలను ముందుగానే గుర్తిస్తున్నారు. మరికొందరు అవగాహనలేక డబ్బులు పోగొట్టుకుంటున్నారు.. వారికి ఇంకా అవగాహన రావాల్సి ఉంది. తెలిసినవారి మాదిరిగా ఫేస్బుక్, ఈమెయిల్స్‌లో డబ్బు అడుగుతూ, బ్యాంకు ఖాతాలు ఇస్తుంటారు.. దీనిపై అనుమానం ఉంటే వెంటనే అసలైన ఖాతాదారుడికి ఫోన్‌చేసి సమాచారం తెలుసుకోండి.. గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఎఫ్బీ ఖాతా సృష్టించారని తెలిస్తే వెంటనే గ్రూప్‌లో ఉన్న వారిని అప్రమత్తం చేయాలి. ఫేస్బుక్ ద్వారా ఎవరు కూడా డబ్బు లు అడగరు. అవసరం అనుకుంటే ఫోన్లు చేసి అడుగతారు. నకిలీ విషయాలు దృష్టి రాగానే స్నేహితులను అప్రమత్తం చేయాలి.. – కేవీఎం ప్రసాద్ , ఏసీపీ, హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్