NRI-NRT

2021కు భారీగా H1 దరఖాస్తులు

2021కు భారీగా H1 దరఖాస్తులు

హెచ్‌–1బీ.. విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే ఈ వీసాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, హెచ్‌–1బీ వీసాలకు పరిమితి ఉంటుంది. ప్రతిఏటా కేవలం 65 వేల హెచ్‌–1బీ వీసాలను మాత్రమే యూఎస్‌ సిటిజెన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన 20 వేల మంది విదేశీ విద్యార్థులకు ఈ వీసాలను అందజేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఇప్పటికే లెక్కలు మిక్కిలి దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. త్వరలో కంప్యూటర్‌ ఆధారిత డ్రా ద్వారా హెచ్‌–1బీ వీసాలు జారీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు అమెరికా పౌరసత్వ చట్టం–2021ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ చట్టం కింద గ్రీన్‌ కార్డుల జారీపై ప్రస్తుతం ఉన్న పరిమితిని రద్దు చేయనున్నారు. దీంతో ఇండియన్‌ ఐటీ నిపుణులు భారీగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే అమెరికాలో వేలాది మంది భారతీయులు గ్రీన్‌ కార్డుల కోసం పెట్టుకున్న పిటిషన్లు గత పదేళ్లుగా పెండింగ్‌లోనే పడి ఉన్నాయి.