* డిసెంబరు 20న కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించిన ఇజ్రాయెల్ మెరుపువేగంతో దూసుకెళ్తోంది. 93లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 47శాతం మంది ఫైజర్ టీకా తొలి డోసును, 31శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. దేశంలోని 70 ఏళ్లకు పైబడిన వారిలో 90శాతం మంది రెండు డోసులను తీసుకున్నారని వారు తెలిపారు. వ్యాక్సిన్ మంచి ఫలితాలనిస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెల్ అవివ్ పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జెనియా గ్యాస్ట్రో పబ్‌లో ఒక ప్రత్యేక ఆఫర్‌ను పెట్టారు. మొదటి,రెండు వ్యాక్సిన్ డోసును తీసుకున్న వారికి ఒక బీర్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. వ్యాక్సిన్ నిబంధనల మేరకు ఆల్కహాల్ లేని డ్రింకులను అందిస్తున్నట్లు ఆ పబ్ నిర్వాహకులు తెలిపారు. ‘‘వ్యాక్సిన్ తీసుకొనే చోటుకు మనం వెళ్లలేకపోయినపుడు, మనం వెళ్లే చోటుకే వ్యాక్సిన్‌ను తీసుకురావడమన్నది మంచి ఆలోచన’’ అని ఆ పబ్‌లో వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న మే పెరేజ్ తెలిపారు.
* కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కెప్టెన్ సతీశ్ శర్మ బుధవారం గోవాలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల శర్మ మృతదేహానికి నేడు దిల్లీలో అంత్యక్రియలు నిర్వహించారు. గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడైన సతీశ్ శర్మ భౌతిక కాయాన్ని కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ స్వయంగా మోశారు.
* ఒకప్పుడు మహారాష్ట్రను గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు సహా మంత్రులు కరోన బారిన పడుతున్నారు. తాజాగా ఆరోగ్య శాఖ ఇన్‌చార్జ్ రాజేష్ తోపేతో సహా మంత్రులు జయంత్ పాటిల్, రక్షా ఖాడ్సే, రాజేంద్ర షింగ్నే, మరికొందరు నేతలు కరోనా బారిన పడ్డారు. మంత్రి ఓంప్రకాష్ బాబారావు తనకు రెండోసారి కరోనా సోకినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఈ మధ్యకాలంలో తనని కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు. మరో మంత్రి జయంత్ ఆర్ పాటిల్ సైతం తాను కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేశారు. కాగా ఈయన ఇటీవలె శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో పాల్గొనడంతో మిగతా కేబినెట్ సభ్యులకు కరోనా భయం పట్టుకుంది.
* శుక్రవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చు.
* ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసే శిరిష్మకు మణికొండ ట్రయల్ విల్లాస్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహం జరిగింది. వీరు ఏడాదిగా గచ్చిబౌలి డీ అడ్రెస్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు సంతానం లేదు. సిద్ధార్థ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి శిరిష్మ గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
* ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు సృష్టించిన బీభత్సంలో గల్లంతైనవారి ఆచుకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 61 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 28 శరీర అవయవాలను వెలికితీసిన సహాయ సిబ్బంది వారిని గుర్తించే పనిలో ఉన్నారు. విపత్తు సంభవించి రెండు వారాలు కావస్తుండటంతో తమ కుటుంబ సభ్యులు తిరిగొస్తారనే ఆశలను వదులుకుంటున్నాయి కార్మికుల కుటుంబాలు. మితగావారు బతికుండే అవకాశం లేదని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు.
* ఎట్టకేలకు చైనా నిజాన్ని కొంతవరకు అంగీకరించింది. భారత్‌తో గత ఏడాది గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ సైనికుల్ని కోల్పోయినట్లు అధికారికంగా ఒప్పుకొంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అధికారిక పత్రికలో శుక్రవారం ఈ విషయాన్ని ప్రచురించింది. ఇంతకాలం ఈ అంశాన్ని అధికారికంగా ఒప్పుకోకపోయినప్పటికీ.. చైనా వైపు నష్టం తీవ్ర స్థాయిలోనే ఉందని బయటి ప్రపంచానికి అప్పట్లోనే అర్థమైంది.
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో కివీస్ యువపేసర్ కైల్ జేమిసన్ పంట పండింది. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే న్యూజిలాండ్ కరెన్సీలో రూ.15 కోట్లంటే ఎంతో తెలియదని జేమీసన్ అంటున్నాడు!
* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఘాజీపూర్‌లోని రైతుల నిరసన శిబిరాల వద్దకు వెళ్లారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్‌ను కలిశారు. తెలంగాణలో పది రోజుల పాటు తాను చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర గురించి ఆయనతో చర్చించారు. తన పాదయాత్రకు రైతుల నుంచి విశేష ఆదరణ వచ్చిందని వివరించారు. మిగతా రైతు నేతలతోనూ రేవంత్ మాట్లాడారు.
* భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ సమన్లు ఇచ్చింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని అమిత్ షాకు సూచించింది. వ్యక్తిగతంగా, లేదా లాయర్ ద్వారా గానీ సోమవారం 10గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు.
* విశాఖ స్టీల్‌ప్లాంట్ భూముల్ని తన చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నది జగన్నాటకమని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూములను తన బినామీలకు కట్టబెట్టే రహస్య అజెండా తొలి అంకంలో భాగంగానే జగన్ మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాశారని మండిపడ్డారు. ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి అమ్మకం కుట్రలో సూత్రధారులు అయితే పాత్రధారులు అరబిందో, హెటిరో అని దుయ్యబట్టారు. కాకినాడ సెజ్, బే పార్క్ భూములను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారన్న యనమల.. తొలుత విశాఖ భూములు, ఆశ్రమ భూములపై గద్దల్లా వాలి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేశారని ఆక్షేపించారు. సీఎం మాటలను బట్టి పోస్కోతో ఒప్పందం నిజమేనని తెలుస్తోందన్నారు. ఎకరా రూ.3కోట్ల విలువ చేసే ఈ భూముల ప్రయోజనం స్థానికులకే దక్కాలి తప్ప జగన్ బినామీల పరం కారాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి తమ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కార్మిక సంఘాలు కోరుతుంటే వారిని పట్టించుకోకుండా యాగానికి వెళ్లడం ఎంత వరకు సబబని యనమల ఓ ప్రకటనలో నిలదీశారు.
* ఎస్సీలపై రాళ్లదాడి జగన్ ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తామంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని లింగాపురం గ్రామంలో ఎస్సీలపై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. వైకాపా నేతల దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. ఎస్సీలు రాజకీయాల్లోకి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో స్వే్చ్ఛగా పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని జగన్ గుర్తించాలని హితవు పలికారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లోనూ ప్రజా మద్దతు తమకే ఉందని వైకాపా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. గ్రామాల మీదకు గూండాలను వదిలి బడుగు బలహీన వర్గాలపై దాడులకు దిగటం, ఇళ్లకు వెళ్లి బెదిరించడంతో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అత్యంత హేయమని మండిపడ్డారు. కులం పేరుతో దూషించి, రాళ్లతో దాడి చేసిన వైకాపా నేతలపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అడ్డు కట్టవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా.. కిందిస్థాయి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంఆర్‌వో చిన్న వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఓటర్లకు లడ్డూలు పంచుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. విచారణ జరిపి నిజమని తేలితే అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
* మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో వార్డు వాలంటీర్లను ఉపయోగించకూడదని తెదేపా నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. గతేడాది వైకాపా నేతల బెదిరింపులతో తమ పార్టీ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని.. మళ్లీ అవకాశమివ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశానన్నారు.
* పశ్చిమబెంగాల్ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబు దాడి వ్యవహారంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే జాకీర్‌పై దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా కొందరు ఆయన్ను తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు మమతా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గురువారం హుస్సేన్ చికిత్స పొందుతున్న ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిని సందర్శించారు. బుధవారం జరిగిన ఘటనతో పాటు, ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మమతా రైల్వే వ్యవస్థ పనితీరుపై మండిపడ్డారు. మంత్రిపై దాడి రైల్వే పరిసరాల్లో జరిగిన కారణంగా.. ఈ ఘటనకు సంబంధిత శాఖనే బాధ్యత వహించాలని అన్నారు.
* నావికాదళంలో ఎన్నో ఏళ్లు సేవలందించిన టీయూ-142 యుద్ధ విమానం ఇకపై కాకినాడలో దర్శనమివ్వనుంది. శత్రుమూకలకు ముచ్చెమటలు పట్టించిన ఆ విమానం కాకినాడ బీచ్‌లో ప్రదర్శించేందుకు గోదావరి నగర అభివృద్ధి సంస్థ (గుడా) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. సముద్ర గస్తీలో రెండున్నర దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించి, నిష్ర్కమించిన ఈ యుద్ధ విమానాన్ని నావికాదళం కాకినాడకు కేటాయించింది. ఇప్పటికే విశాఖలో ఈ విమాన ప్రాజెక్టు అక్కడివారిని ఆకర్షిస్తుండగా దాని తరహాలోనే కాకినాడలో అభివృద్ధి చేస్తున్నారు.
* సీఎం జగన్ అంతర్వేది పర్యటనలో కొవిడ్ వారియర్స్ నిరసన తెలిపారు. సీఎంను కలిసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్.. కరోనా వేళ సేవలందించిన తమను ప్రభుత్వ విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను కలిసేందుకు అవకాశం రాకపోవడంతో ఎమ్మెల్యే రాపాక ఎదుటే తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు.
* క్రమంగా తగ్గిపోతోందనుకుంటున్న సమయంలో కరీంనగర్ నగర శివారు చేగుర్తిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతోనే చనిపోగా.. ఆయన అంత్యక్రియల్లో గ్రామస్థులు పాల్గొన్నారు. అందులో పాల్గొన్న వారిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో చేగుర్తిలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి నమూనాలను సేకరించారు. నిన్న 45 మంది నమూనాలు పరీక్షించగా 16 మందికి, ఈరోజు మరో 17 మంది కలిపి మొత్తం 33 మందికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు కరీంనగర్ రూరల్ మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు.
* ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ భూ భాగంలోని 3 గ్రామ పంచాయతీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిశా ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఒడిశా పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం గతంలోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు.
* విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వీడియో మాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. రవీంద్రుడు స్థాపించిన ‘విశ్వభారతి’ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభలో పాల్గొనటం తనకు ప్రేరణాత్మకంగా, సంతోషదాయకంగా ఉందని తెలిపారు. తాను వ్యక్తిగతంగా హాజరై ఉంటే మరింత బాగుండేదని, కరోనా నియమాల కారణంగా అది వీలు కాలేదన్నారు. భారత్ ప్రపంచానికే గురుస్థానంలో ఉండాలన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ‘విశ్వగురు’ భావనను సుసాధ్యం చేసేందుకు నూతన విద్యా విధానం దోహదపడుతుందన్నారు.
* పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలో రాజీనామా చేయనున్నారని ఆ కేంద్రపాలిత ప్రాంత భాజపా బాధ్యులు నిర్మల్ కుమార్ సురన తెలిపారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో తప్పకుండా బలం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాజీనామా చేసిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరు భాజపాలో చేరారు. మరోవైపు నారాయణస్వామి ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
* గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో మళ్లీ ఎస్‌ఈసీ విచారణ జరపకూడదని.. ఇవ్వనిచోట ఫలితాలు వెల్లడించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదంటూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి ఈనెల 23 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది.