* అత్త వివాహేతర సంబంధం పెట్టుకో వడంతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు (25) 8నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నందనవనం కాలనీలో భార్య నిర్మలతో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. అనుమానంతో నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాబు పది మందిలో పంచాయితీ పెట్టడంతో ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్ చేసి తిట్టి బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
* తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును అరెస్టు చేసినట్లు డీసీపీ రవీందర్ వెల్లడించారు. బిట్టు శ్రీను పెద్దపల్లి జడ్పీ ఛైర్మర్ పుట్ట మధు మేనల్లుడు. న్యాయవాదుల హత్యకు సంబంధించి వాహనం, ఆయుధాలు సమకూర్చినట్లు బిట్టు శ్రీను మీద అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
* జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బఘాట్ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ కాల్పుల్లో సొహైల్ అనే కానిస్టేబుల్ ఘటనా స్థలంలో మృతిచెందగా.. మహ్మద్ యూసుఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం రోడ్డులో ఉగ్రవాది కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు.. దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.
* ఇటీవల గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు కనకంబట్ల వెంకటేశ్వరశర్మ శుక్రవారం కన్నుమూశారు. విహార యాత్రలో భాగంగా జనవరి 24వ తేదీ తెల్లవారు జామున సోమనాథ ఆలయానికి వెళ్తుండగా ద్వారక్ వద్ద ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాలస్వామి దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ రమణ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వరశర్మ, ఈవో సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరశర్మ ఇవాళ మృతి చెందారు.
* వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది.